కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికార పార్టీలోని అసంతృప్తి బయట పడింది. అది కూడా సీఎం సొంత జిల్లాలో కావడం విశేషం. రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశారు. నిజానికి రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం కావడంతో, అదే జిల్లా అవుతుందని అందరూ భావించారు. అయితే రాజకీయ కారణాలతో రాజంపేట నుంచి రాయచోటికి జిల్లా కేంద్రం మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అన్నమయ్య జిల్లా పరిధిలోకి రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె అసెంబ్లీ నియోకవర్గాలు న్నాయి. మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాలని స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అలాగే రాజంపేటను చేయాలని రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల ప్రజలు కొంత కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. వీటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఎట్టకేలకు అన్నమయ్య జిల్లాను రాయచోటిలో సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి రాయచోటి, పీలేరు ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి మాత్రమే ప్రజాప్రతినిధులుగా హాజరయ్యారు. మిగిలిన మదనపల్లె, తంబళ్లపల్లె, రాజంపేట, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలెవరూ అటు వైపు తొంగిచూడకపోవడం చర్చనీయాంశమైంది. పైగా వీరంతా అధికార పార్టీ ఎమ్మెల్యేలు. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి వైసీపీలో ముఖ్య నేత కూడా. కడప జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పది నిమిషాల పాటు ఉండి వెళ్లిపోయారు. ఈయన రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ నేత.
జిల్లా కేంద్రం ఏర్పాటులో ప్రభుత్వం వివక్ష చూపిందని అన్నమయ్య జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేల గైర్హాజరే తెలియజేస్తోంది. మరో రెండేళ్లలో జరగనున్న ఎన్నికల్లో తమపై ఈ జిల్లా ఏర్పాటు ప్రభావం పడుతుందనే భయం అధికార పార్టీ ఎమ్మెల్యేలను వెంటాడుతోంది.
తాము కూడా రాయచోటికి వ్యతిరేకమే అనే సంకేతాల్ని పంపడానికి, కొత్త జిల్లా ప్రారంభ వేడుకకు వెళ్లలేదనే చర్చ జరుగుతోంది. ఆరుగురు ఎమ్మెల్యేల్లో నలుగురు గైర్హాజరయ్యారంటే… ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఎంత అశాస్త్రీయంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశారో అర్థం చేసుకోవచ్చు.