ఈనాడు పత్రికాధినేత రామోజీరావుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పంతం నెగ్గించుకున్నారు. ఈనాడు కడప టాబ్లాయిడ్ మొదటి పేజీ లోగోలో ఎట్టకేలకు వైఎస్సార్ అని పెట్టడం విశేషం. 2009లో వైఎస్సార్ దుర్మరణం చెందారు. కడప జిల్లా పులివెందుల నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రి అయ్యారు. తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన పుట్టిన గడ్డతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ఆయన అమూల్యమైన సేవలందించారు.
వైఎస్సార్ సేవలకు గుర్తింపుగా కడప జిల్లాకు ఆయన పేరును నాటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.రోశయ్య నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో తీర్మానించారు. 2009, అక్టోబర్ మొదటి వారంలో ఆయన పేరును ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ఎల్లో పత్రికలు మాత్రం తమ జిల్లా సంచికల్లో నిన్నటి వరకూ వైఎస్సార్ పేరు పెట్టకపోవడం విమర్శలకు తావిచ్చింది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన జిల్లాల పునర్వ్యస్థీకరణ చేపట్టారు. సోమవారం నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభమైంది. కొన్ని కొత్త జిల్లాలకు అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, అన్నమయ్య, శ్రీసత్యసాయి పేర్లను పెట్టారు. దీంతో ఈనాడు వైఎస్ విషయంలో తన వివక్షను, పక్షపాత వైఖరిని కొనసాగించడానికి వీల్లేని స్థితిని జగన్ కల్పించారు. అయిష్టంగానైనా కడప టాబ్లాయిడ్లో వైఎస్సార్ పేరు ప్రముఖంగా ఈనాడులో కనిపించడం పాఠకులను, ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది.
ప్రభుత్వం కొత్త జిల్లాలకు పెట్టిన ప్రముఖల పేర్లతో ఈనాడు టాబ్లాయిడ్ లోగోలు కనిపించడం విశేషం. ఇతర ప్రముఖల పేర్ల కోసమైనా వైఎస్సార్ పేరుతో కడప టాబ్లాయ్ను ఈనాడు తీసుకురావాల్సి వచ్చింది. దాదాపు 12 ఏళ్లుగా వైఎస్సార్ పేరు పెట్టకుండా పంతం సాగిస్తున్న పత్రికాధినేతపై జగన్ ఇప్పటికి విజయం సాధించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ మార్చించి జిల్లాల రూపురేఖలే కాదు. కరడుగట్టిన వైఎస్సార్ కుటుంబ ద్వేషి మనసు కూడా అనే చర్చకు తెరలేచింది.