ఏదో ఆవేశంతో జరిగిన హత్యలు కావవి.. అనే విషయం స్పష్టం అవుతోంది. మనుషులు అంత ట్రాన్స్ లోకి వెళ్లిపోయి, అంత తీవ్రమైన చేష్టలకు పాల్పడాలంటే దీర్ఘకాలంగానే వారిపై అలాంటి ప్రభావాలు ఉండి ఉండాలని స్పష్టం అవుతుంది.
తమ కూతుళ్లు ఏదైనా చేయకూడని తప్పు చేశారనే ఆవేశంలో కొంతమంది పిల్లలను చంపిన కేసులు ఉంటాయి. అవి క్షణికావేశంతోనో, పరువు పోయిందనే తీవ్రమైన నిస్పృహతోనో జరిగినవి అయ్యుంటాయి.
మదనపల్లె లో జరిగిన హత్యాకాండలో మాత్రం.. ఆ అమ్మాయిలు చదువు విషయంలో అయినా, వ్యక్తిత్వం విషయంలో అయినా తల్లిదండ్రులు గర్వించే స్థాయిలోనే ఉన్నారనే విషయం స్పష్టం అవుతోంది. ఎటొచ్చీ ఆ పిల్లలపై మూఢనమ్మకాల ప్రభావం చాలా చాలా తీవ్రంగా ఉంది.
వారే తమ తల్లిదండ్రులను కూడా ఆ ట్రాన్స్ లోకి తీసుకెళ్లిన దాఖలాలున్నాయని పోలీసుల కథనాన్ని బట్టి అర్థం అవుతోంది. మరి ఇంతకీ వాళ్ల మానసిక పరిస్థితి ఏమిటి? అనేది సామాన్యులకు అంత తేలికగా అర్థం అయ్యే విషయం కాదు.
ఈ విషయం పై వారి గురించి బాగా తెలిసిన వారే చెప్పాలి. అయితే.. వారి సహోద్యోగులను, వారి గురించి బాగా తెలిసిన వారిని మీడియా సంప్రదిస్తే.. ఎవరూ సూటిగా స్పందిస్తున్నట్టుగా లేదు. వారి వైఖరి అనుమానాస్పదంగా ఉండేదని ఎవ్వరూ గట్టిగా చెప్పకపోవడం గమనార్హం.
పురుషోత్తమ్ నాయుడు- పద్మజల పెద్ద కూతురు తొమ్మిదో తరగతి నుంచినే తనకు అతీతశక్తులున్నాయని ఇంట్లో చెప్పేదని వార్తలు వస్తున్నాయి. మరి ఇంట్లో అలాంటి పరిస్థితి ఉంటే.. బయట వాళ్లతో వారు ప్రవర్తించే తీరు సహజంగానే వేరేగా ఉంటుంది. వాళ్లు అంత ఘాతుకానికి పాల్పడ్డారంటే అదంతా రాత్రికి రాత్రి వచ్చి ఉండే మార్పు అయ్యి ఉండదనేది తర్కం.
తమకు ఎందుకు వచ్చిందని అనుకున్నారో ఏమో కానీ.. వారి సహోద్యోగులంతా మూడో వ్యక్తి ప్రమేయం అని అంటున్నారు. అలాగే మరి కొందరు పురుషోత్తమ్ నాయుడు కుటుంబాన్ని ఎవరైనా హిప్నటైజ్ చేసి ఉండొచ్చని అంటున్నారు. అయితే.. పోలీసుల విచారణలో మాత్రం మూడో వ్యక్తి ప్రమేయం పై ఎలాంటి ఆధారాలూ దొరకలేదని తెలుస్తోంది.
పురుషోత్తమ్ నాయుడు తమ పిల్లల అంత్యక్రియల సమయంలో దరిద్రం పట్టి తమ పిల్లలను తామే చంపుకున్నట్టుగా అరిచాడట. ఆయన భార్య పద్మజ తనే శివుడిని అంటూ ఇంకా ఆ ట్రాన్స్ లోనే ఉన్నట్టుగా వ్యవహరించినా.. పురుషోత్తమ్ నాయుడుకు మాత్రం తాము ఏం చేసిందీ అర్థం అయినట్టుగా ఉంది.
అయితే మన సమాజంలో ఇలాంటి వారు వీరే కాదు. అతి విశ్వాస పరులు, భక్తిని ఉన్మాధపూరితంగా తీసుకునే వాళ్లు ఉండనే ఉంటారు. వీరు భక్తి, విశ్వాసాల విషయంలో తమను తాము అందరికీ అతీతులుగా భావిస్తూ ఉంటారు. అతి భక్తి గురించి ఎవరైనా తమను ఏమైనా అంటే అలాంటి వాళ్లు అస్సలు సహించరు.
ఎవరో బాబానో, సాధువునో అతిగా నమ్మడం చేసే వాళ్లూ ఉంటారు. వాళ్ల పూజలు, వస్త్రధారణల్లో కూడా కొంత చోద్యంగా గోచరిస్తూ ఉంటాయి. వాళ్లు క్షుద్రోపాసకులు కాదు. బాబాల మీదో, మరో రకంగానో అతి విశ్వాసమే ఉంటుంది. వారంలో ఒకరోజును పూర్తిగా వారికే కేటాయించి.. అతిగా లీనమైపోవడం, లేదా అనుక్షణం అలాంటి ధ్యాసలోనే ఉండటం కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాగని వారు కూడా అంతా పరుషోత్తమ్ నాయుడు, పద్మజ దంపతుల్లా కిరాతకానికి తెగబడాతారని అనలేం.
ఈ అతి విశ్వాసాల్లో కూడా ఒక్కో డిగ్రీ ఒక్కో స్థాయిలో ఉండవచ్చు. తాము నమ్మే శక్తులకు సంబంధించి రకరకాల పూజలు చేసి ప్రసాదాలను చుట్టుపక్కల వారికి పంచే వాళ్లతో మొదలుపెడితే.. ఈ అతి విశ్వాసపరుల్లో రకరకాల స్థాయిల వారు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు. విశ్వాసం మంచిదే, దేవుడు- భక్తి మనిషికి విశ్వాసాన్ని, ధీమాను ఇస్తాయి. అనుచితమైన తీరుకు తీసుకెళ్లనంత వరకూ ఏదైనా మంచిదే. కానీ.. ఇలాంటి ఘటనలే అనుచితం, అవాంఛనీయం.