ఏపీలో స్థానిక ఎన్నికల సంగ్రామం మొదలైంది. వైసీపీ-టీడీపీ పోటాపోటీ విమర్శల నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. అయితే బీజేపీ, జనసేన మాత్రం తేలుకుట్టిన దొంగల్లాగా మారిపోయాయి.
తిరుపతి ఉప ఎన్నికల్లో సత్తా చూపిస్తామని, ప్రతిపక్షానికి ప్రత్యామ్నాయం మేమేనని, అధికార పక్షానికి ఎప్పటికైనా పోటీ మేమేనంటూ రెచ్చిపోతున్న ఈ మిత్రద్వయం.. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ తో బిత్తరపోయింది.
తిరుపతి సీటు గెలుస్తామంటూ బీరాలు పలుకుతున్న ఈ రెండు పార్టీలు కనీసం ఆ లోక్ సభ సెగ్మెంట్ పరిధిలో ఒక్క వార్డులో అయినా గెలుస్తాయా లేదా అనేది సందేహమే. జనసేన పార్టీకి సంస్థాగతంగా అసలు నిర్మాణమే లేదు.
బీజేపీ విషయానికొస్తే.. ఆ పార్టీ పేరు చెప్పుకుని నియామక పదవులు కొట్టేసేవారున్నారు కానీ, ఎన్నికల రణరంగంలో నిలబడి సత్తా చూపేవారు లేనే లేరు. తిరుపతి పరిధిలోనే కాదు, ఏపీలో ఎక్కడా బీజేపీ, జనసేనకు వార్డు మెంబర్, సర్పంచ్ గా గెలిచే సత్తా లేదు.
ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల ఓవర్ యాక్షన్ నాలుగు రోజులుగా పూర్తిగా తగ్గిపోయింది. ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటినుంచి బీజేపీ, జనసేన తరపున ఎవరూ నోరు తెరిచి మాట్లాడిన పాపాన పోలేదు.
టీడీపీ అయినా.. ఏకగ్రీవాల పేరుతో ఏమారుస్తున్నారని రచ్చ చేస్తోంది, గ్రామాల్లో సత్తా చూపాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేస్తున్నారు. అయితే బీజేపీ, జనసేన తరపున మాత్రం నోరు తెరవలేకపోతున్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో సత్తా చూపాలని అటు వీర్రాజు కానీ, ఇటు జనసేనాని కానీ పిలుపు ఇవ్వకపోవడం గమనార్హం. మామూలుగా ఈ పాటికే ఈ రెండు పార్టీలు స్థానిక ఎన్నికల్లో కలసి పనిచేసే విషయంపై సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టుకోవాలి. ఏ గ్రామం ఎవరికి, ఏ వార్డులో ఎవరు పోటీ చేయాలనే వాటాలు వేసుకోవాలి. ఆ వెంటనే పవన్ నుంచి ప్రెస్ నోట్ కూడా రావాలి.
అభ్యర్థులకే దిక్కులేని టైమ్ లో ఇలాంటి మీటింగ్ లు పెట్టుకోవడం వేస్ట్ అనుకున్న రెండు పార్టీలు… అసలా ఊసే ఎత్తడం లేదు. స్థానిక ఎన్నికల్లో సత్తా చూపుతాం అని వీర్రాజు, పవన్ కల్యాణ్ చెప్పలేకపోవడం ఏపీలో ఆ రెండు పార్టీల దీనస్థితికి నిదర్శనం.