ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారుల బదిలీలు రొటీన్ గా జరిగేవే. గతంలో అయితే ఏకంగా డీజీపీనే బాధ్యతల నుంచి తప్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు…2009 ఎన్నికల సమయంలో రాష్ట్ర డీజీపీనే కేంద్ర ఎన్నికల సంఘం విధుల నుంచి తప్పించింది.
మరొకరిని ఆ స్థానంలో నియమించింది. అప్పట్లో ఆ బదిలీని నాటి ప్రభుత్వం వ్యతిరేకించలేదు. కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినట్టుగా చేసింది. అయితే గత సార్వత్రిక ఎన్నికల సమయంలో అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘం తీరునే ఆక్షేపిస్తూ వచ్చారు.
తీరా పోలింగ్ రోజున వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రతినిధిగా ఉండిన ద్వివేదీతో ముఖాముఖీ గొడవకు దిగారు చంద్రబాబు నాయుడు. ఎన్నికల సంఘం ఆఫీసుకు వెళ్లి.. చంద్రబాబు నాయుడు గొడవ పెట్టుకున్నారు! ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ అలా ఎన్నికల సంఘం అధికారితో తగవు పెట్టుకోవడం చంద్రబాబుకే చెల్లింది.
అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ గురించి అనవిగాని నీతులు చెబుతారు! ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ.. ఎన్నికల సంఘం ఆఫీసుకు వెళ్లి.. ముఖ్య అధికారితో తగవు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు నీతులు చెబితే, వినే వాళ్లకు వాంతులు అవుతాయి. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం గజినీలా గతాన్ని అంతా మరిచిపోవాలన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు.
ఆ సంగతలా ఉంటే.. ఏపీలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికారుల బదిలీల ప్రక్రియ గట్టిగా సాగుతోంది. ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్లను బాధ్యతలను తప్పించారు, ఎస్పీలను కూడా తప్పిస్తూ ఉన్నారు. వారి స్థానంలో వేరే వాళ్లకు బాధ్యతలు అప్పగించడానికి లిస్టును పంపాలని ఎస్ఈసీ కోరగా.. ఆ మేరకు ప్రభుత్వం ముగ్గురు ముగ్గురు జాబితాలను పంపిందట.
అయితే ఆ జాబితాను కూడా ఎస్ఈసీ తిరస్కరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. వివిధ కారణాలతో వారు కూడా ఎస్ఈసీకి నచ్చనట్టుగా తెలుస్తోంది. మరి అంతిమంగా ఈ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే లోగా.. ఏపీలో ఎంతమంది కలెక్టర్లు బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంటుందో, ఉన్న అధికారులు ఎస్ఈసీకి నచ్చుతారో లేదో అనేది ఆసక్తిదాయకంగా మారింది.