'జగన్ రెడ్డి పాలనపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయి. ఎక్కడా తట్ట మట్టి, బొచ్చె సిమెంట్ వేయలేదు. అభివృద్ధి పనులను ఆపేశారు. పేదలపై పన్నులు వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఆలయాలపై దాడులు దాడులతో వైకాపా అన్ని వర్గాలకూ దూరం అయ్యింది…' ఇలా చెప్పుకుపోయారట తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.
తన పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారట. చంద్రబాబు నాయుడు చాలానే చెప్పారు. ఇంకేం.. ఇంత వ్యతిరేకత ఉంటే, చంద్రబాబు నాయుడే ఇంత చెప్పారంటే.. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తిరుగులేనట్టేనేమో!
ఒక వర్గంలో కాదట.. అన్ని వర్గాల్లోనూ జగన్ రెడ్డి మీద వ్యతిరేకత పొంగి పొర్లుతోందట. అటు మత రాజకీయం, ఇటు కులాల ప్రస్తావన చేసి, మరోవైపు అభివృద్ధి ఆగిపోయిందంటూ.. చంద్రబాబు నాయుడు ఇక జగన్ కథ అయిపోయిందని తన పార్టీ వాళ్లకు తేల్చి చెప్పినట్టున్నారు.
మరి ఇంకేం.. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయమే సాధించాలి. అయితే… అందుకు మాత్రం షరతూ ఉందట! ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరగాలట. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే తెలుగుదేశం పార్టీ నెగ్గేస్తుందట.
జగన్ పాలనపై అంతులేని వ్యతిరేకత పెరిగిందని స్వయంగా చెబుతున్న చంద్రబాబు నాయుడు, తమ పార్టీ గెలవడం ఖాయమని మాత్రం చెప్పడం లేదు. అందుకు షరతులున్నాయి! అవతల ఎన్నికల కమిషనర్ ను తెలుగుదేశం పార్టీ అడుగడుగునా సమర్థిస్తూ ఉంది.
ఎన్నికల కమిషనర్ ను చంద్రబాబు మనిషిగా అభివర్ణిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో జరిగే ఎన్నికలు కూడా స్వేచ్ఛాయుతం కాదని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారా? తెలుగుదేశం కోరుకున్నప్పుడు ఎన్నికలు ఆగాయి, ఆ పార్టీ కోరుకుంటున్నప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరగాలనుకున్నప్పుడు ఎన్నికలు జరగలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వద్దనుకున్నప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. అయినా.. ఇంకా చంద్రబాబు నాయుడు స్వేచ్ఛాయుత పరిస్థితులు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నిజంగానే గెలుపుపై నమ్మకం ఏదైనా ఉంటే.. ఈ నొక్కులు ఎందుకో!