జనసేన, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. వారాహి యాత్రను ప్రారంభించిందే జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది పవన్‌ను సీఎంగా చూడాలని ఏపీ మంత్రి విశ్వరూప్ కోరుకుంటున్నారు. అది కూడా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని సాక్షిగా.
మంత్రి విశ్వరూప్ శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఇటీవల పవన్‌కల్యాణ్ అమలాపురంలో వారాహి యాత్ర నిర్వహించారు. అయితే మంత్రి విశ్వరూప్‌పై పెద్దగా విమర్శలు చేయకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో పవన్‌పై మంత్రి కూడా అదే స్థాయిలో అభిమానాన్ని చాటుకున్నారు. ఎలాగంటే…పవన్‌ను సీఎంగా చూడాలనే కోరికను వెల్లడించడం ద్వారా. అయితే విశ్వరూప్ ఆశించినట్టు సీఎం కావాలంటే పవన్ చిక్కుల్లో పడాల్సి వస్తుంది.
అసలే ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందలేనని పవన్ అంటుంటే… అలా కుదరదు, మీరు 175 సీట్లలో పోటీ చేసి 88 స్థానాలను దక్కించుకుని సీఎం కావాలని విశ్వరూప్ చెబుతున్నారు. పవన్ అభిమానులే కాదు, తనకు కూడా పవన్‌ను సీఎంగా చూడాలని వుందని మంత్రి చెబుతున్నారు మరి! కనీసం టీడీపీతో పొత్తులో భాగంగా 100 స్థానాల్లోనైనా పోటీ చేసి 50 స్థానాల్లోనైనా గెలవాలని మంత్రి సూచించడం విశేషం.
తనపై ఎంతో ప్రేమతో మంత్రి విశ్వరూప్ చేస్తున్న సూచనల్ని పవన్‌కల్యాణ్ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం వుంది. తనను వైసీపీలో అభిమానించే మంత్రులు కూడా ఉన్నారని పవన్‌కు ఇప్పటికైనా తెలిసిందా? అభిమానుల చిరు కోరికను మన్నించి, సీఎం సీటు కోసం 175 స్థానాల్లో పోటీ చేయాలి. అబ్బే… ఇదంతా తనకు ఇరికించేందుకు చేస్తున్న సూచనలని ఆయన అంటే చేయగలిగేదేమీ లేదు.