తొలిప్రేమ.. ఈ కల్ట్ మూవీ పవన్ కల్యాణ్ కెరీర్ ను సెట్ చేయడమే కాదు, నిర్మాత దిల్ రాజు కెరీర్ ను కూడా గాడిలో పెట్టింది. కెరీర్ స్టార్టింగ్ లో, డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న రోజుల్లో, దిల్ రాజుకు ఆర్థికంగా కలిసొచ్చిన సినిమా ఇది. అందుకే ఈ సినిమాను తను ఎన్నటికీ మరిచిపోలేనంటాడు దిల్ రాజు.
కెరీర్ ప్రారంభంలో తనకు అడుగులు నేర్పించిన సినిమాగా తొలిప్రేమను చెప్పుకొచ్చిన రాజు, ఆ సినిమా రిలీజ్ టైమ్ లో తను చూసిన ఓ ఆశ్చర్యకర షయాన్ని కూడా పంచుకున్నాడు. ఓవైపు ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అవుతున్నప్పటికీ, మరోవైపు తొలిప్రేమ సినిమాకు జనాలు పోటెత్తారని, ఆ సీన్ ను తను ఎప్పటికీ మరిచిపోనన్నాడు.
“తొలి ప్రేమ వందో రోజు. ఇండియా-పాక్ మ్యాచ్ జరుగుతోంది. సంధ్య థియేటర్ లో జనాలు మాత్రం తగ్గలేదు. జనాల్ని కంట్రోల్ చేయలేకపోయాం. ఇదొక చరిత్ర. అలాంటి సీన్ ఇన్నేళ్లలో మళ్లీ నేను చూడలేదు. అప్పట్లో థియేట్రికల్ రైట్స్ ఐదేళ్లకు ఇచ్చేవారు. నాకు ఎప్పుడు డబ్బులు తగ్గినా, ఏదైనా సినిమా ఫ్లాప్ అయినా, వెంటనే తొలిప్రేమ సినిమాను రీ-రిలీజ్ చేసేవాడ్ని. ఎప్పుడు వేసినా డబ్బులొచ్చాయి. అలా 3 సార్లు రిలీజ్ చేశాను.”
కల్ట్ సినిమాకు ఇలాంటి ట్రయిలర్ ఏంటి..?
పాతికేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తొలిప్రేమ సినిమాను ఈనెల 30న రీ-రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా ట్రయిలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో అలనాటి తొలిప్రేమ అనుభవాల్ని గుర్తుచేసుకున్నాడు దిల్ రాజు. దర్శకుడు కరుణాకరన్ తో పాటు, నిర్మాత, నటి వాసుకి, ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అంతా బాగుంది కానీ, ఇలాంటి కల్ట్ సినిమాను రీ-రిలీజ్ చేస్తూ విడుదల చేసిన ట్రయిలర్ మాత్రం ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. పాతికేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా గ్రాండ్ గా సినిమాను రిలీజ్ చేస్తూ, చాలా చీప్ గా ట్రయిలర్ కట్ చేశారు. సినిమా పాతదే కావొచ్చు, ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా ఉండొచ్చు. కానీ ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేస్తున్నప్పుడు, ఆ ఫ్యాన్స్ తో పాటు, సినిమా స్థాయిని దృష్టిలో పెట్టుకొని ట్రయిలర్ నీట్ గా కట్ చేయించి ఉంటే బాగుండేది.
ఈనెల 30న తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 థియేటర్లలో తొలిప్రేమ సినిమాను 4కె క్వాలిటీతో రీ-రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో, అతడి సరసన కీర్తిరెడ్డి హీరోయిన్ గా నటించింది.