ఏపీలో కుల రాజకీయాలు ఊపందుకున్నాయి. దీనంతటికి పవన్‌కల్యాణ్ వారాహి యాత్రే కారణం. గత పదేళ్లుగా జనసేనను బలోపేతం చేసేందుకు పవన్‌కల్యాణ్ చేసిన ప్రయత్నాలు శూన్యం. ఇప్పుడు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టకపోతే, ఇక శాశ్వతంగా పార్టీని మూసేసుకోవాలనే భయం ఆయన్ను వెంటాడుతోంది. ఏపీలో తన సామాజిక వర్గానికి ఉన్న బలాన్ని రాజకీయంగా క్యాష్ చేసుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు.
సీఎం జగన్‌పై తన సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే వరకూ పరిమితమై వుంటే వేరేగా వుండేది. అత్యుత్సాహంతో కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని రెచ్చగొట్టేలా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దీంతో ముద్రగడ పద్మనాభం ఘాటైన రెండు లేఖలను రాశారు. దీంతో ముద్రగడపై కాపు నాయకులను పవన్ ఎగదోశారు.
ఇది కాస్త కాపు వర్సెస్ కాపు అనే రీతిలో వ్యవహారం తయారైంది. ఈ నేపథ్యంలో కాపుల మధ్య చోటు చేసుకున్న అవాంఛనీయ పరిణామాలకు ఫుల్స్టాప్ పెట్టాలనే డిమాండ్లు వారి నుంచి వస్తున్నాయి.
ఏపీలో ముద్రగడ, పవన్ మధ్య సాగుతున్న డైలాగ్ వార్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తనదైన స్టైల్లో స్పందించారు. ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారని ఆయన అన్నారు. వాళ్లిద్దరి మధ్య వివాదాన్ని కులపరంగా చూడకూడదని ఆయన కోరారు. కేవలం రాజకీయంగా మాత్రమే చూడాలని కాపు నాయకుడైన సోము వీర్రాజు అభిప్రాయపడడం గమనార్హం.
అలాగే టీడీపీతో కలిసి బీజేపీ వెళ్తుందని ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు. అమిత్‌షాతో చంద్రబాబు భేటీ అయినంత మాత్రాన ఇష్టానుసారం ఊహించుకుంటే తామేం చెబుతామని ఆయన ప్రశ్నించారు.