తెలుగోడి వీక్ కంటెంట్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కంటే పెద్దది

మైక్ టైసన్ నీరసంగా కొట్టినా సగటు మనిషి దవడ పగలడం ఖాయం. ఇక్కడ మైక్ టైసన్ తెలుగు సినిమా, సగటు మనిషి బాలీవుడ్ అన్నమాట.  Advertisement ముంబాయి సినీ జనానికి అసలేం జరుగుతోందో అర్థం…

మైక్ టైసన్ నీరసంగా కొట్టినా సగటు మనిషి దవడ పగలడం ఖాయం. ఇక్కడ మైక్ టైసన్ తెలుగు సినిమా, సగటు మనిషి బాలీవుడ్ అన్నమాట. 

ముంబాయి సినీ జనానికి అసలేం జరుగుతోందో అర్థం కావట్లేదు. గత మూడేళ్లుగా బాలీవుడ్ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమానే లేదు. ఉన్నంతలో “కాశ్మీర్ ఫైల్స్” తన సత్తా చాటుకుంటోందని మురిసిపోయే లోపు “ఆర్ ఆర్ ఆర్” వచ్చింది. 

నిజానికి “ఆర్ ఆర్ ఆర్” కంటెంట్ వీక్. తొలి రోజు ఆట చూసి ఈ తెలుగోడి సినిమా ఎంతమాత్రమూ ఆడే ప్రసక్తి లేదని అనుకున్నారు హిందీ క్రిటిక్స్. తమ “కాశ్మీర్ ఫైల్స్” కి ఎదురులేదనుకున్నారు. 

అయితే “ఆర్ ఆర్ ఆర్” తన సత్తా చాటుకుంది.  అక్కడ హిందీ బెల్టులో కూడా మరో కొత్త సినిమా లేదు. వాళ్లకిప్పుడు “కాశ్మీర్ ఫైల్స్” ఒక్కటే దంగలైనా, బాహుబలి అయినా!

అదికూడా మూడొందల కోట్లు పైచిలుకు వసూలు చేసి సద్దుమణిగింది. 

ఇక్కడ గమనించాల్సిన పాయింటొకటుంది. వీక్ కంటేంట్ తో వచ్చిన “ఆర్ ఆర్ ఆర్” బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “కాశ్మీర్ ఫైల్స్” ని ఎప్పుడో అధిగమించేసింది. అంటే, టాలీవుడ్ నుంచి స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తే బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 

వ్యాపారాత్మకంగా తెలుగు సినిమా బాలీవుడ్ ని బెదరకొట్టడం “బాహుబలి”తో మొదలయింది. 

“కట్టప్పా కో బాహుబలి నే క్యూన్ మారా” అంటూ అప్పట్లో ప్రధాని నరేంద్ర మోది ఒక స్పీచులో అనడం వైరలయ్యింది. 

ఈ మధ్య యూపీ ఎన్నికల నేపథ్యంలో రాజనాథ్ సింగ్ ఒక బహిరంగ సభలో అభ్యర్థి పుష్కర్ గురించి మాట్లాడుతూ, “అప్నా పుష్కర్ ఫ్లవర్ భీ హై, ఔర్ ఫైర్ భీ హై!!” అంటూ “పుష్ప” సినిమా డయలాగ్ తరహాలో మాట్లాడి చప్పట్లు కొట్టించుకున్నారు. ఆ స్పీచులో “పుష్ప” దేశవ్యాప్తంగా తన సత్తా ఎలా చాటిందో కూడా సూచనప్రాయంగా చెప్పారు. 

దీనినిబట్టి అర్థమవుతున్నది ఒక్కటే. జాతీయవ్యాప్తంగా తెలుగుసినిమా దావానలంలా వ్యాపించింది. హిందీ ప్రజలు కూడా దక్షిణాది తరహా సినిమాలనే ఇష్టపడుతున్నారు. ఈ ధాటిని తట్టుకుని నిలబడేందుకు ఎలాంటి సినిమాలు తీయాలో తెలియక బాలీవుడ్ దర్శక దిగ్గజాలు తలలు పట్టుకుంటున్నారు. 

ఎక్కడో ఒక్క రామగోపాల్ వర్మ, ఒక మణిరత్నం తప్ప బాలీవుడ్ లో తమ సత్తా చాటి గౌరవాన్ని నిలబెట్టుకున్న దక్షిణాది దర్శకులు చరిత్రలో చాలా అరుదు. మణిరత్నమైనా చెన్నై కేంద్రంగా ఉంచుకుని అడపాదడపా ముంబాయిలో హిందీ సినిమాలు తీసారు కానీ రామగోపాల్ వర్మ మాత్రం పూర్తిగా ముంబాయిలో స్థిరపడి ఏళ్లతరబడి శివ నుంచి సర్కార్ వరకు గర్వించదగ్గ హిందీ సినిమాలు తీయగలిగారు. ఆయనగారి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా గతవైభవం మాత్రం తిరుగులేనిది, తనకు మాత్రమే చెల్లింది. బాలీవుడ్ ఒక్క వర్మని, మణిరత్నం ని తప్ప మిగిలిన దక్షిణ భారతీయ దర్శకులందర్నీ సెకండ్ గ్రేడ్ గానే చూసేవారు. 

ముందు నుంచీ బాలీవుడ్ లో సౌత్ సినిమా అంటే చిన్న చూపే. కానీ ఇప్పుడు సీన్ రివెర్స్ అయ్యింది. బాలీవుడ్ ప్రభ తగ్గి దక్షినాది వోల్టేజ్ పెరిగింది. 

థియేటర్స్ భారతీయ సినిమా అంటే తెలుగు సినిమాని, ఓటీటీల్లో భారతీయ సత్తా అంటే మళయాళ సినిమాల్ని చూపించాల్సొస్తోంది. కే.జీ.ఎఫ్ లాంటి కన్నడ సినిమాలు కూడా జాతీయ స్థాయిలో హిందీ సినిమాలని బెదరకొడుతున్నాయి. రాజమౌళి, సుకుమార్, శంకర్, సందీప్ వంగా, ప్రశాంత్ నీల్..వీళ్లే ప్రస్తుత భారతీయ సినిమాకి దర్శక మదగజాలు. 

తమ క్షేత్రంలో సరైన విత్తనపుష్టి లేనప్పుడు బాలీవుడ్ మీడియా ఎంత పిసుక్కుంటే మాత్రం ఫలితమేముంటుంది? ప్రజల పల్స్ ని పట్టుకుని ఏలుతున్న ఈ సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ తో బాలీవుడ్ హీరోలు చచ్చినట్టు పనిచేయాల్సిందే. లేకపోతే వాళ్లు మరింత చిన్నబోయే ప్రమాదముంది. 

శ్రీనివాసమూర్తి