ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో టీడీపీ విందు రాజకీయ వార్తలు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మరోసారి కాంగ్రెస్‌తో టీడీపీ జత కట్టనుందనే ప్రచారం విస్తృతంగా సాగింది. దీంతో టీడీపీ ఉలికిపాటుకు గురైంది.
ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించిన పార్టీగా కాంగ్రెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ మూల్యం చెల్లించుకుంది. అలాంటి పార్టీతో మరీ ముఖ్యంగా ఏపీలో టీడీపీ అంటకాగడానికి ప్రయత్నిస్తోందనే ప్రచారంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టి నామరూపాలు లేకుండా పోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుంటే అదే దుస్థితి తప్పదనే చర్చకు తెరలేచింది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో విందు సమావేశం కావడంపై టీడీపీ శ్రేణులు, నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. పొత్తుల సంగతి పక్కన పెడితే ప్రత్యర్థులకు ఆయుధాలను ఇచ్చినట్టైందనే ఆవేదన టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యలను టీడీపీ చేపట్టింది. శుభకార్యానికి వెళ్లడాన్ని రాజకీయం చేస్తారా? అని టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కె.రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు.
ఢిల్లీలో డీఎంకే కార్యాలయ ప్రారంభోత్సవానికి వెళ్లగా, కాంగ్రెస్‌తో పొత్తు అంటూ ప్రచారం చేయడాన్ని వారు తప్పు పట్టారు. చాటుమాటు రాజకీయాలు చేయమని వారు స్పష్టం చేశారు. ఏపీలో ప్రతిపక్షాన్ని శత్రువుగా చూస్తున్నారని వారు వాపోయారు.