చక్ర‌బంధంలో చంద్ర‌బాబు!

తెలుగుదేశం అధ్య‌క్షుడు చంద్ర‌బాబును చాణుక్యుడితో పోలుస్తూ ఉంటుంది ఆయ‌న ఆస్థాన మీడియా! చ‌క్రం తిప్పిన చంద్ర‌బాబు అంటూ.. లెక్క‌కు మిక్కిలిన‌న్ని సార్లు హెడ్డింగ్ గా పెట్టి ఉంటారు! ఈ గోబెల్స్ ప్ర‌చారం వ‌ల్ల చంద్ర‌బాబు…

తెలుగుదేశం అధ్య‌క్షుడు చంద్ర‌బాబును చాణుక్యుడితో పోలుస్తూ ఉంటుంది ఆయ‌న ఆస్థాన మీడియా! చ‌క్రం తిప్పిన చంద్ర‌బాబు అంటూ.. లెక్క‌కు మిక్కిలిన‌న్ని సార్లు హెడ్డింగ్ గా పెట్టి ఉంటారు! ఈ గోబెల్స్ ప్ర‌చారం వ‌ల్ల చంద్ర‌బాబు ప్ర‌త్య‌ర్థులు కూడా ఆయ‌న‌ను అతిగా ఊహించుకుంటూ వ‌చ్చారు. ఆఖ‌రికి సామాన్య జ‌నాల్లో కూడా చంద్ర‌బాబు అంటే సామాన్యుడు కాద‌ని, తిమ్మిని బ‌మ్మిని చేయ‌గ‌ల‌డ‌నే న‌మ్మ‌కం ఉంది. అయితే అది అధికారంలో ఉన్నంత‌సేపూ మాత్ర‌మేననే విష‌యం కూడా మ‌రిచిపోయి చంద్ర‌బాబు అసామాన్యుడు, వ్య‌వ‌స్థ‌ల‌కు అతీతుడు అనే న‌మ్మ‌కం ఒక‌టి ఏర్ప‌డింది. గ‌త నాలుగేళ్ల ప‌రిణామాలు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే క‌లిగించాయి.

వివిధ వ్య‌వ‌హారాల్లో ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను స‌వాల్ చేస్తూ ప్ర‌తిప‌క్షం ర‌క‌ర‌కాల వ్య‌వ‌స్థ‌ల‌ను ఆశ్ర‌యిస్తూ వ‌చ్చింది. కొన్ని వంద‌ల వ్య‌వ‌హారాలు ఇలాంటివి ఉన్నాయి. ఇలా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిప‌క్షంలో ఉండి కూడా పాల‌న‌ను స్తంభింప‌జేశాడ‌నే పేరు కూడా ఒక స‌మ‌యంలో వ‌చ్చింది. అయితే.. తెలుగుదేశం అధినేత‌కు ఆఖ‌రి రీల్లో సినిమా క‌నిపిస్తూ ఉంది. ఎన్నిక‌ల‌కు గ‌ట్టిగా ఇంకో ఆరు నెల‌ల స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు నాయుడు అనూహ్య‌మైన ఇబ్బందులు ప‌డుతూ ఉన్నారు. ఇప్ప‌టికే చంద్ర‌బాబు నాయుడు జైలు పాలై నెల‌న్న‌ర కావొస్తోంది. 

ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు చ‌క్రబంధంలో ఇరుక్కుపోయారు. చంద్ర‌బాబును బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికి మ‌హామ‌హా లాయ‌ర్లు రంగంలోకి దిగారు. ఆయ‌న‌ను తొలి రోజే జైలు నుంచి బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికి విజ‌య‌వాడ ఏసీబీ కోర్టులో లాయ‌ర్ల స‌మూహం ఏర్ప‌డింది. చంద్ర‌బాబు అరెస్టు అనేది పొర‌పాటు నిర్ణ‌యం అని, సాయంత్రానికి చంద్ర‌బాబు జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి వెక్కిరిస్తాడ‌ని కూడా కొంత‌మంది అనుకున్నారు! చంద్ర‌బాబు  వీరాభిమాన వ‌ర్గాలు కూడా.. చంద్ర‌బాబు చాణ‌క్యం ముందు అవేం ప‌నికిరావ‌ని బ‌లంగా న‌మ్మారు!

అయితే నంద్యాల్లో అరెస్టై, విజ‌య‌వాడ‌లో వ‌దిలేయ‌క‌త‌ప్ప‌దేమో అనే పరిస్థితి ఏకంగా నెల‌న్న‌ర పాటు కొన‌సాగుతూ ఉంది. చంద్ర‌బాబు కేసుల్లో వ‌ర‌స వాయిదాలు కూడా తెలుగుదేశం పార్టీ వ‌ర్గాల‌ను విస్మ‌య‌ప‌రుస్తూ ఉన్నాయి. చ‌ట్టం ముందు అంద‌రూ స‌మానులే అనే విష‌యం వారికి ఈ పాటికి అర్థ‌మై ఉండాలి. తెలుగుదేశం వ‌ర్గాల పిటిష‌న్లు ఇది వ‌ర‌కూ అర్ధ‌రాత్రి అయినా న్యాయ‌స్థానాల‌ను తెరిపించాల‌న్న‌ట్టుగా ఆ పార్టీ వైఖ‌రి ఉండేది. అయితే చంద్ర‌బాబు నాయుడు విష‌యంలో ఆ పార్టీ వ‌ర్గాల న్యాయ‌పోరాటం ఏ మాత్రం ప్ర‌యోజ‌నాన్ని ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం!

క్వాష్ పిటిష‌న్ అంటూ ప‌ట్టుకు తిర‌గ‌డం పెద్ద పొర‌పాటులాగా ఉంద‌నే అభిప్రాయాలు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. విజ‌య‌వాడ ఏసీబీ కోర్టులోనూ క్వాష్ పిటిష‌న్ అన్నారు, హైకోర్టులోనూ అదే వాద‌న‌, సుప్రీంలోనూ అదే వాద‌న‌! సాంకేతిక కార‌ణాల‌ను చూపించి..మొత్తానికే కేసును కొట్టి వేయించుకుని బ‌య‌ట‌కు రావాల‌నే ప్ర‌య‌త్నం వారిది. అయితే క్వాష్ పిటిష‌న్ల‌పై బ‌ల్ల‌లు గుద్దేది ఏమీ ఉండ‌ద‌ని, ఒక‌వేళ అలాంటి సాంకేతిక కార‌ణాలు ఉంటే..న్యాయ‌స్థానాలు పెద్ద‌గా ఆలోచించ‌కుండా పిటిష‌న‌ర్ వైపు సానుకూలంగా స్పందిస్తాయ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

అయితే చంద్ర‌బాబు క్వాష్ పిటిష‌న్ ను ఏసీబీ కోర్టు, హైకోర్టు తిర‌స్క‌రించ‌గా.. సుప్రీం కోర్టులో దానిపై వాదోప‌వాదాలు కొన‌సాగుతూ ఉన్నాయి, వాయిదాలు ప‌డుతూ ఉన్నాయి. క్వాష్ పిటిష‌న్ పై సుదీర్ఘ వాద‌న‌లు అంటే అది పిటిష‌నర్ కు శ‌రాఘాతం లాంటిదే అని న్యాయ‌నిపుణులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

ఆ సంగ‌త‌లా ఉంటే.. చంద్ర‌బాబు నాయుడుకు మ‌రిన్ని కేసుల ముచ్చ‌ట కూడా ఉంది. కేవ‌లం స్కిల్ స్కామ్ మాత్ర‌మే కాకుండా.. ఇత‌ర వ్య‌వ‌హారాల్లోనూ ఆయ‌న విచార‌ణ‌ల‌ను, రిమాండ్ ల‌ను, క‌స్ట‌డీల‌ను ఎదుర్కొనాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డ‌వ‌చ్చు అనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఇంకో పక్షం రోజుల పాటు చంద్ర‌బాబు నాయుడు జైల్లో గ‌డిపినా.. తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి మ‌రింత ఇర‌కాటంలో ప‌డుతుంది. చంద్ర‌బాబు అరెస్టుతో ఆ పార్టీ గ‌తి పూర్తిగా త‌ప్పింది. లోకేష్ ప్ర‌తిభాపాట‌వాలు ఏమిటో అంద‌రికీ తెలిసిందే. ఈ ప‌రిణామాల‌న్నీ చంద్ర‌బాబే కాకుండా, తెలుగుదేశం పార్టీనే చ‌క్ర‌బంధంలో ఇరుక్కున‌ట్టుగా ఉంద‌నే అభిప్రాయాల‌ను క‌లిగిస్తున్నాయి.