దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలంలో శ్రీరామ నవమి ఉత్సవాలకు కేసీఆర్ ఎందుకు మొహం చాటేస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2015లో ఒకసారి మాత్రమే అధికారికంగా కేసీఆర్ భద్రాచలం వచ్చారు. మరి మిగతా సంవత్సరాల్లో ఎందుకు రాలేదు..? అసలు భద్రాద్రి అంటే కేసీఆర్ కి ఎందుకంత చిన్నచూపు. యాదాద్రి వైభవానికి ఖర్చు పెట్టిన నిధుల్లో కనీసం పావు వంతు కూడా తాను అధికారంలోకి వచ్చాక ఎందుకు విడుదల చేయలేదు. అసలేం జరుగుతోంది..?
ప్రస్తుతం కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారు. ఈ ఏడాది కూడా ఆయన శ్రీరామనవమికి భద్రాచలంకు వచ్చేట్టు కనిపించడంలేదు. ప్రభుత్వం తరపున సీఎం దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఇచ్చే ఆనవాయితీని అసలు కేసీఆర్ పట్టించుకున్నట్టే కనపడ్డంలేదు. ఉమ్మడి ఆంధ్రలో మాత్రం క్రమం తప్పకుండా ముఖ్యమంత్రులు భద్రాచలం వెళ్లేవారు, ప్రభుత్వం తరపున లాంఛనాలు చేపట్టేవారు. కానీ నిధులు, నీళ్లు, ఉద్యోగాలంటూ కొట్లాడిన కేసీఆర్ మాత్రం భద్రాద్రిని మర్చిపోయారు.
పోనీ ఆయనకు గుడులంటే ఇష్టంలేదు అని సరిపెట్టుకోవడానికి వీల్లేదు. యాదాద్రిపై ఆయన ప్రేమ తెలిసిందే. యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చి అంగరంగ వైభవంగా రూపు రేఖల్నే మార్చేశారు కేసీఆర్. ఆ స్థాయిలో కాకపోయినా, కనీసం భద్రాద్రిపై కూడా ఆయన ప్రేమ చూపించాలి కదా. కానీ ఇక్కడ అది మిస్సైంది.
కారణం ఏంటి..?
నారసింహుడిపై ఉన్న భక్తి రాముడిపై కేసీఆర్ కి లేదా. తారక రామారావు అని కొడుక్కి పేరు పెట్టుకున్నారు కదా, మరి రాముడిపై ఆమాత్రం భక్తి లేదా..? పోనీ రాముడంటే బీజేపీ పేటెంట్ ఉన్న దేవుడని కేసీఆర్ భావిస్తున్నారా..? వాస్తవానికి భద్రాద్రి రాముడే కాదు, భద్రాచలం కూడా ఇప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది.
భద్రాచలం రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడం, ఆమధ్య పోలవరం ముంపు ప్రాంతాల పేరుతో కొన్ని మండలాలను ఏపీలో కలిపేయడంతో.. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి.
అమిత్ షా ఎంట్రీ..
భద్రాద్రి రాముడిని తెలంగాణ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని అంటున్న బీజేపీ నేతలు.. అక్కడ తమ పట్టు పెంచుకోవాలని చూస్తున్నారు. శ్రీరామ నవమికి అమిత్ షా భద్రాచలం వస్తారనే ప్రచారం ఉంది. అదే జరిగితే.. భద్రాద్రి రాముడిని పూర్తి స్థాయిలో రాజకీయ రంగంలోకి దింపినవారవుతారు.