వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తుందనే వార్తలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. అయితే ఆమె ఆ ప్రచారంలో నిజం లేదని తనదైన శైలిలో ఖండిస్తున్నారు. కానీ గత కొంత కాలంగా రాజకీయంగా షర్మిల పూర్తిగా ఇంటికే పరిమితమై, సోషల్ మీడియాలో పోస్టులను పెడుతూ వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెస్‌లో చేరిక ప్రచారం నేపథ్యంలో ఆమె ఒక ట్వీట్ చేశారు. ఊహాజనిత కథలు కల్పిస్తూ తనకు, తెలంగాణ ప్రజలకు మధ్య అగాధాన్ని సృష్టించేందుకు విఫలయత్నాలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తన భవిష్యత్ తెలంగాణతోనే, తెలంగాణలోనే అని స్పష్టం చేశారు. అలాగే తన ఆరాటం, పోరాటం తెలంగాణ కోసమే అని తెలిపారు. ఇంత వరకూ బాగానే ఉంది.
షర్మిల ట్వీట్‌లో స్పష్టత కొరవడింది. తెలంగాణలోనే తన రాజకీయం అనేంత వరకూ ఆమె క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసి, అక్కడే కేసీఆర్‌పై పోరాడేందుకు ఆమె నిర్ణయించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా ట్వీట్‌లో కూడా కేసీఆర్‌పై దృష్టి పెట్టాలని షర్మిల సూచన చేయడాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. అయితే షర్మిల రాజకీయం అవసరం ఆంధ్రప్రదేశ్‌లో ఉందని, అక్కడి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ బలపడుతుందని ఆ పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు చర్చ జరుగుతోంది.
ఎన్నికల వేళ షర్మిల పూర్తిగా మౌనం పాటించడం, విలీన వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమవడం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి కలిగిస్తోంది. తెలంగాణలో షర్మిల పార్టీకి కనీస స్పందన రాకపోవడం, అలాగే పార్టీని నడపడానికి ఆర్థిక వనరులు తగినన్ని లేకపోవడంతో ఆమె నిరాశలో ఉన్నట్టు సమాచారం. అందుకే ఆమె చూపు కాంగ్రెస్ వైపు మళ్లిందనే ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్‌లో పాత పరిచయాలను దృష్టిలో పెట్టుకుని తగిన గుర్తింపు, గౌరవం దక్కించుకునేందుకు షర్మిల వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారనే ప్రచారం నడుస్తోంది. షర్మిల వాలకం చూస్తుంటే ఏపీకి వెళ్లే అవకాశాలు లేవని తెలుస్తోంది.