పల్నాడుకు చెందిన మహిళా మంత్రి విడదల రజినీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు భారీగా ఫిర్యాదులు వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. 2019లో ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన విడదల రజినీ … జగన్ గాలిలో చిలకలూరిపేట నుంచి గెలుపొంది, ఆ తర్వాత రెండో కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కించు కున్న అత్యంత అదృష్టవంతురాలిగా గుర్తింపు పొందారు.
అయితే తన నియోజకవర్గంలో కేడర్‌కు అందుబాటులో ఉండరని, వారి సమస్యలను పట్టించుకునే పరిస్థితే లేదనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ప్రధానంగా మంత్రి రజినీపై భారీగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ నాయకులే తమ పనులు చేయడానికి రజినీ ఎంతెంత డబ్బు తీసుకున్నారో ఆధారాలతో సహా అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.
రజినీపై ఆరోపణలు, తగిన ఆధారాలతో సహా తీసుకెళ్లి సీఎం జగన్ ఎదుట మరో మంత్రి పెట్టినట్టు సమాచారం. పల్నాడు జిల్లాకు సంబంధించి ఆ మంత్రి పార్టీ బాధ్యతల్ని చూస్తున్నారని సమాచారం.
విడదల రజినీ ఎంతసేపూ తానేదో అద్భుతంగా చేస్తున్నట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ, సీఎం జగన్ సహా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కేడర్‌లో పాజిటివిటీని క్రియేట్ చేసుకున్నారని, క్షేత్రస్థాయిలో అంత సీన్ లేదని సదరు మంత్రి పార్టీ అధిష్టానం పెద్దలకు నివేదించినట్టు సమాచారం. మరోవైపు పీకే టీమ్ కూడా చిలకలూరిపేటలో రజినీకి అంత సీన్ లేదని, ఆమెకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని సీఎంకు నివేదించినట్టు సమాచారం.
అతి తక్కువ సమయంలోనే రజినీకి పదవులు వాటంతట అవే వెతుక్కుంటూ వచ్చాయి. చిన్న వయసులో అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి పేరు సంపాదించుకోవాల్సింది పోయి, శత్రువులను రోజురోజుకూ పెంచుకుంటున్నారనే విమర్శ ఆమెపై వుంది. దీపం ఉన్నప్పుడు ఇంటిని చక్కదిద్దు కోవాలనే క్రమంలో, పొలిటికల్ కెరీర్‌కే ప్రమాదం వచ్చేలా ఆమె వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.