ఈ ప్ర‌పంచ‌క‌ప్ లో మ‌రిన్ని సంచ‌ల‌నాలు?

ఇంగ్లండ్ పై ఆప్ఘానిస్తాన్ గెలుపు, సౌతాఫ్రికాపై నెద‌ర్లాండ్స్ జ‌ట్టు గెలుపు… ఈ ప్ర‌పంచ‌క‌ప్ లో ఇప్ప‌టి వ‌ర‌కూ న‌మోదైన సంచ‌ల‌నాలు. ప్ర‌పంచ‌క‌ప్ లో ఇలాంటి సంచ‌ల‌నాల‌కు కొద‌వ‌లేదు. ద‌శాబ్దాల చ‌రిత్ర‌లో ఇలా బ‌ల‌మైన‌వి అనుకున్న…

ఇంగ్లండ్ పై ఆప్ఘానిస్తాన్ గెలుపు, సౌతాఫ్రికాపై నెద‌ర్లాండ్స్ జ‌ట్టు గెలుపు… ఈ ప్ర‌పంచ‌క‌ప్ లో ఇప్ప‌టి వ‌ర‌కూ న‌మోదైన సంచ‌ల‌నాలు. ప్ర‌పంచ‌క‌ప్ లో ఇలాంటి సంచ‌ల‌నాల‌కు కొద‌వ‌లేదు. ద‌శాబ్దాల చ‌రిత్ర‌లో ఇలా బ‌ల‌మైన‌వి అనుకున్న జ‌ట్ల‌ను బ‌ల‌హీన జ‌ట్లు ఓడించ‌డం కొత్త కాదు! మ‌హామ‌హా జ‌ట్లు కూడా చిన్న జ‌ట్ల చేతిలో ఓట‌మితో ప్ర‌పంచ‌క‌ప్ రేసు నుంచే నిష్క్ర‌మించిన సంద‌ర్భాలున్నాయ‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు.

2007 ప్ర‌పంచ‌క‌ప్ లో టీమిండియా స్వ‌యంగా అలాంటి దారుణ అనుభ‌వాన్ని ఎదుర్కొంది. వెస్టిండీస్ లో జ‌రిగిన ఆ ప్ర‌పంచ‌క‌ప్ లో బంగ్లాదేశ్ చేతిలో ఇండియా ఓట‌మి పాల‌వ్వ‌డం దారుణ ప‌రాజ‌య‌మే. ఇప్పుడు బ‌ల‌మైన జ‌ట్టునే ప‌రిగ‌ణించినా, అప్ప‌టికి బంగ్లా బేబీ మాత్ర‌మే! అయితే ఆ ప్ర‌పంచ‌క‌ప్ లో ఇండియాను  ఓడించ‌డం ద్వారా బంగ్లా ఇండియా అవ‌కాశాల‌ను దెబ్బ‌తీసింది. లీగ్ ద‌శ‌లోనే బంగ్లాతో పాటు శ్రీలంక చేతిలో కూడా ఓట‌మి పాలవ్వ‌డంతో ఇండియా ఆ ప్ర‌పంచ‌క‌ప్ నుంచి నిష్క్ర‌మించింది. అప్పుడు ఇండియాపై ఉన్న అంచ‌నాల‌కూ ఆ ప్ర‌ద‌ర్శ‌న‌కూ ఏ మాత్రం సంబంధం లేదు!

ఇక వ‌ర‌ల్డ్ క‌ప్ లో కూన‌లు, బ‌ల‌హీన జ‌ట్ల చేతిలో ఓడిపోయిన జ‌ట్లలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికాలు కూడా ఉన్నాయి. 2007లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ లో జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది. అప్పుడు ఆస్ట్రేలియా జ‌ట్లు కూర్పుకు, ఉన్న ఫామ్ కూడా జింబాబ్వే చేతిలో ఓట‌మి అనేది పెను సంచ‌ల‌నం! జింబాబ్వే చేతిలో ఓట‌మి అప్పుడు ఆస్ట్రేలియా జ‌ట్టు కాన్ఫిడెన్స్ ను దెబ్బ‌తీసింది. తాము ఆస్ట్రేలియాను ఓడించ‌గ‌ల‌మా అని ఇత‌ర జ‌ట్లు న‌మ్మ‌లేని ఆ ప‌రిస్థితుల్లో జింబాబ్వే సాధించిన విజ‌యం ఇత‌ర జ‌ట్ల‌కు కూడా ఆస్ట్రేలియా అజేయ‌మైన‌ది కాద‌నే కాన్ఫిడెన్స్ ను ఇచ్చింది. తొలి సారి నిర్వ‌హించిన ఆ టీ20 ప్రపంచ‌ప్ లో ఆస్ట్రేలియా పెద్ద ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌కుండానే వెనుదిరిగింది.

ఇక కూన‌ల చేతిలో ఓడిపోవ‌డం ఇంగ్లండ్ కూ అనుభ‌వ‌మే. గ‌తంలో ఐర్లండ్ చేతిలో ఇంగ్లండ్ ఒక ప్ర‌పంచ‌క‌ప్ లో ఓడిపోయింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ లో ఇది వ‌ర‌కే ఒక‌సారి ఇంగ్లండ్ ను ఓడించిన నెద‌ర్లాండ్స్ ఇప్పుడు వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో కూడా అదే ఫీట్ రిపీట్ చేసింది. ఐర్లండ్ జ‌ట్టు 2007 ప్ర‌పంచ‌క‌ప్ లోనే పాకిస్తాన్ ను ఓడించింది. బంగ్లాదేశ్ ఇండియాను ఓడిస్తే, ఐర్లండ్ జ‌ట్టు పాక్ ను ఓడించి ఇంటికి పంపించింది. అప్ప‌ట్లో క్రికెట్ లో పెను సంచ‌ల‌నాలు అవి!

ఇక శ్రీలంకను కెన్యా ఓడించ‌డం 2003 ప్రపంచ‌క‌ప్ లో ఒక సంచ‌ల‌నం. ఆ ప్ర‌పంచ‌క‌ప్ లో కెన్యా ఏకంగా సెమి ఫైన‌ల్ వ‌ర‌కూ వ‌చ్చింది. వ‌ర్షంతో ఒక‌టీ రెండు మ్యాచ్ ల ర‌ద్దుతో పాటు లంక‌పై సాధించిన విజ‌యం ఆ జ‌ట్టును సెమిస్ వ‌ర‌కూ చేర్చింది.

మ‌రి ఇలా చూస్తే ప్రతి వ‌రల్డ్ క‌ప్ లోనూ ఒక‌టీ రెండు సంచ‌ల‌న ఫ‌లితాల మ్యాచ్ లు ఉండ‌నే ఉంటాయి. అయితే అలా సంచ‌ల‌నాలు న‌మోదు చేసే జ‌ట్ల ప్ర‌తిభాపాట‌వాలు ఆ త‌ర్వాతి మ్యాచ్ లో కూడా కొన‌సాగ‌ని సంద‌ర్బాలే ఎక్కువ‌! కూన‌ల హోదా నుంచి ప్ర‌మోష‌న్ పొంద‌డానికి ఏ జ‌ట్టుకు అయినా చాలా స‌మ‌య‌మే ప‌డుతోంది. అలా బంగ్లాదేశ్ వంటి జ‌ట్టు ఎంతో కొంత నిల‌దొక్కుకోగా.. కెన్యా లాంటి జ‌ట్లు ఆ త‌ర్వాత అడ్ర‌స్ ను కూడా కోల్పోతూ ఉంటాయి.

కాబ‌ట్టి సంచ‌ల‌న ఫ‌లితాల ద్వారా జ‌ట్లు కుదురుకోవ‌డం ఎలా ఉన్నా.. పెద్ద జ‌ట్ల‌ను ఇంటికి పంపించ‌డంలో మాత్రం విజ‌య‌వంతం అవుతూ ఉంటాయి. మ‌రి ఈ ప్ర‌పంచ‌క‌ప్ లో ఇప్ప‌టికే అలాంటి చెప్పుకోద‌గిన విజ‌యాలు న‌మోదు కాగా.. ఇంకా మ‌రిన్నింటికి ఆస్కారం ఉండ‌నే ఉందేమో!