వైసీపీకి బైబై… వెల్ క‌మ్ ఏ పార్టీకి?

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండు రోజులుగా కొత్త నినాదం అందుకున్నారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే జ‌న‌సేన స్థానం ఏంట‌నేది స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డం. త‌న‌కు గిట్ట‌ని జ‌గ‌న్‌ను అధికారం నుంచి సాగ‌నంప‌డ‌మే ఏకైక ల‌క్ష్య‌మ‌ని, అంత‌కు మించి…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండు రోజులుగా కొత్త నినాదం అందుకున్నారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే జ‌న‌సేన స్థానం ఏంట‌నేది స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డం. త‌న‌కు గిట్ట‌ని జ‌గ‌న్‌ను అధికారం నుంచి సాగ‌నంప‌డ‌మే ఏకైక ల‌క్ష్య‌మ‌ని, అంత‌కు మించి వేరే ఆశ‌యాలేవీ లేవ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెప్ప‌క‌నే చెప్పార‌నే చ‌ర్చ న‌డుస్తోంది. ప‌వ‌న్ తాజాగా భుజాన ఎత్తుకున్న నినాదాన్ని జ‌న‌సేన పెద్ద ఎత్తున ప్ర‌చారంలో పెట్టింది. అదేంటంటే…

అభివృద్ధి జరగాలంటే.. అరాచకం ఆగాలంటే.. జనం బాగుండాలంటే..ఒక్కటే నినాదం..”హల్లో ఏపీ…బై బై వైసీపీ!” 

వైసీపీకి బైబై చెప్పి, ఏ పార్టీకి వెల్ క‌మ్ చెప్పాల‌ని జ‌న‌సేనాని త‌హ‌త‌హ‌లాడుతున్నారో ప్ర‌క‌టించాల్సిన అవ‌స‌రం వుంది. సాధార‌ణంగా ఏ పార్టీ అధినేత అయినా తన పార్టీ అధికారంలోకి రావాల‌ని, తాను ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని భావిస్తారు. ఇదేం విచిత్ర‌మో కానీ, ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యంలో ఇందుకు పూర్తి విరుద్ధం. 

ఎంత సేపూ వైఎస్ జ‌గ‌న్‌ను గ‌ద్దె దించ‌డం త‌ప్ప‌, మ‌రొక చింతే లేకుండా పోయింది. ప్ర‌త్య‌ర్థి పార్టీగా తాను అధికార గ‌ద్దెనెక్కాల‌నే ఆలోచ‌న‌, ఆశ‌యం లేని నాయ‌కుడిగా కేవ‌లం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను మాత్ర‌మే చూస్తున్నామ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో త‌న కుల బ‌లాన్ని వ్య‌క్తిగ‌త ద్వేషాన్ని తీర్చుకోడానికే ఉప‌యోగిస్తున్నార‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. వైఎస్ జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా న‌ష్ట‌ప‌రిచేందుకు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌ధానంగా కులాన్ని అస్త్రంగా ప్ర‌యోగిస్తున్నారు. 

వైసీపీకి బైబై చెప్పి, ఆ సీటులోకి ఎవ‌రొస్తార‌నే విష‌య‌మై ప‌వ‌న్ త‌న పార్టీ శ్రేణుల‌కు ఎందుకు చెప్ప‌లేక‌పోతున్నార‌నే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. ఎందుకీ దాప‌రికం? చంద్ర‌బాబును సీఎం చేయ‌డ‌మే ప‌వ‌న్ ల‌క్ష్య‌మ‌నే ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న నినాదం బ‌ల‌ప‌రిచేలా వుంది. టీడీపీ ప‌ల్ల‌కీ మోయ‌డానికి ప‌వ‌న్‌కు ఒక పార్టీ, దానికి విధివిధానాలు, వారాహి యాత్ర అంటూ బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌లు అవ‌స‌ర‌మా? అనే విమ‌ర్శ బ‌లంగా వ‌స్తోంది.