హ‌మ్మ‌య్య‌…ఊపిరి పీల్చుకున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

గాజు గ్లాసు గుర్తుపై జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఊపిరి పీల్చుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లకు జ‌న‌సేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కొన‌సాగిస్తూ ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. రిజ‌ర్వ్‌డ్ సింబ‌ల్…

గాజు గ్లాసు గుర్తుపై జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఊపిరి పీల్చుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లకు జ‌న‌సేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కొన‌సాగిస్తూ ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. రిజ‌ర్వ్‌డ్ సింబ‌ల్ క‌లిగిన రిజిస్ట‌ర్డ్ పార్టీల జాబితాలో జ‌న‌సేన‌ను ఉంచ‌డం విశేషం. 

ఇదిలా వుండ‌గా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేసింది. అనంత‌రం ఆ గుర్తును జ‌న‌సేన కోల్పోయింది. రాష్ట్రంలో గుర్తింపు క‌లిగిన ప్రాంతీయ పార్టీ హోదా నుంచి జ‌న‌సేన‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం తొల‌గించింది. దీంతో జ‌న‌సేన ఎన్నిక‌ల గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబ‌ల్ అయ్యింది. 

ఎన్నిక‌ల సీజ‌న్ మొద‌లు కావ‌డంతో జ‌న‌సేన గుర్తుపై ప్ర‌త్యర్థులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. చంద్ర‌బాబు ప‌ల్ల‌కీ మోయ‌డానికి సిద్ధం కావ‌డం వ‌ల్లే గాజు గ్లాసు గుర్తును ప‌వ‌న్ కోల్పోయార‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ నుంచి తీపి క‌బురు వెలువ‌డింది. గాజు గ్లాసును జ‌న‌సేన‌కే రిజ‌ర్వ్ చేసిన‌ట్టు పేర్కొన‌డం ఆ పార్టీకి శుభ‌ప‌రిణామం. 

అయితే ఎన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో గాజు గ్లాసు క‌నిపిస్తుంద‌నేది ప్ర‌ధానం. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే గాజు గ్లాసు 20 స్థానాల‌కు మించి పోటీ చేసే ప‌రిస్థితి వుండ‌ద‌నే చ‌ర్చ సాగుతోంది. త‌క్కువ స్థానాల్లో పోటీ చేస్తూ, క‌నీస ఓట్ల శాతం పొంద‌లేక‌పోతే రానున్న రోజుల్లో గాజు గ్లాసు ద‌క్కే అవకాశాలు త‌క్కువే.