ఎప్పుడైతే కేపీ చౌదరిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారో, ఆ వెంటనే కొంతమంది సెలబ్రిటీల పేర్లు బయటకొచ్చాయి. దాదాపు 12 మంది పేర్లు లీక్ అవ్వగా, అందులో ప్రముఖంగా అషు రెడ్డి పేరు తెరపైకొచ్చింది.
అషు రెడ్డితో కేపీ చౌదరి వందల సార్లు ఫోన్ లో మాట్లాడినట్టు వార్తలొచ్చాయి. ఈ క్రమంలో కొన్ని మీడియా సంస్థలు ఆమె ఫోన్ నంబర్ ను కూడా బయటపెట్టాయి. వీటన్నింటినీపై అషు రెడ్డి స్పందించింది.
కొంతమందితో తనకున్న అసోసియేషన్ పై కొన్ని మీడియా సంస్థలు అవాస్తవాలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపించింది అషు రెడ్డి. కొన్ని గంటలుగా తనపై వస్తున్న వార్తల్ని ఖండిస్తున్నానని తెలిపిన ఆమె, అంతవరకు వస్తే డ్రగ్స్ కేసుకు సంబంధించి చెప్పాల్సిన వ్యక్తులకు నిజాలు చెబుతానని వెల్లడించింది.
తన ఫోన్ నంబర్ ను పబ్లిక్ డొమైన్ లో పెట్టడాన్ని ఎంతమాత్రం సహించనంటూ చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చింది. కేపీ చౌదరితో లింక్స్ ఉన్నాయంటూ తన పేరు తెరపైకొచ్చిన కొన్ని గంటల్లోనే అషు రెడ్డి, తన సోషల్ మీడియా వాల్ లో ఈ ప్రకటన చేసింది.
నిన్నటితో కేపీ చౌదరి 2 రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. విచారణ ముగిసిన వెంటనే అషు రెడ్డి పేరు తెరపైకొచ్చింది. ఆమెతో కేపీ చౌదరి వందల కాల్స్ మాట్లాడినట్టు వార్తలొచ్చాయి. మరోవైపు తను మాత్రమే డ్రగ్స్ తీసుకున్నానని, టాలీవుడ్ లో ఎవ్వరికీ డ్రగ్స్ సరఫరా చేయలేదంటూ కేపీ చౌదరి పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతానికైతే ఈ కేసుపై పూర్తిస్థాయిలో ఛార్జ్ షీట్ తయారుచేసే పనిలో పడ్డారు పోలీసులు. ఛార్జ్ షీట్ సిద్ధమైన తర్వాత కొంతమంది ప్రముఖులకు నోటీసులు పంపించే యోచనలో ఉన్నారు. ఛార్జ్ షీట్ లో అషు రెడ్డి పేరు ఉంటే మాత్రం, ఆమె పోలీసుల విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది.