నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ పక్క పార్టీల వైపు చూస్తున్నారని వార్తలు రావడంతో వాటిని కొట్టి పారేస్తూ సీఎం జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి తన గుండె చప్పుడు అని.. తనను కోస్తే జగనే కనిపిస్తాడు అంటూ.. జగన్‌కు మిలిటెంట్ స్క్వాడ్ లాంటి వాడినని, కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
తన అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సొంత పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. తన సొంత బాబాయ్ రూప్ కుమార్ యాదవ్, నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ ద్వారకానాథ్‌ను లక్ష్యంగా చేసుకుని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మరో తొమ్మిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉందని, ఈ నేపథ్యంలో విశ్రాంతి తీసుకుందామనే ఉద్దేశంతో 20 రోజుల పాటు దూరంగా ఉన్నానని.. చిన్న బ్రేక్ ఇచ్చానని, రేపటి నుంచి తన సత్తా చూస్తారంటూ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు.
తాను మంత్రిగా ఉన్నప్పుడు తన వద్ద పనులు చేయించుకున్న కొంతమంది.. ఇపుడు తనకు దూరం జరిగి అన్ని తామే చేశామని సంకలు గుద్దుకుంటున్నారని తన బాబాయ్‌ను పరోక్షంగా ఎద్దేవా చేశారు. కాగా కొంత కాలంగా సొంత పార్టీ నేతల నుంచే అనిల్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాబాయ్ రూప్‌కుమార్ యాదవ్ రూపంలో తనకు వ్యతిరేక నాయకుడు తయారవడం అనిల్ జీర్ణించుకోలేకపోతున్నారు.
నెల్లూరులో కార్పొరేటర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ఆయన.. వైఎస్ జగన్ వైసీపీని స్థాపించినప్పటి నుంచి ఆయన వెంటే నడుస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఆనం బ్రదర్స్‌కు ఎదురొడ్డి జగన్‌కు అండగా నిలిచారు. తన వెంట నమ్మకంగా నడుస్తున్న అనిల్‌కు రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. రెండో దఫా వైసీపీ అధికారంలోకి రాగానే అనిల్‌కు తన మొదటి కేబినెట్‌లో చోటు ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి పదవి నుంచి తీసేసినా అదే అభిమానంతో జగన్ వెంట ఉన్నారు.