చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటే ఎలా ప‌వ‌న్‌?

చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పంద‌నా తీరు వుంద‌నే విమ‌ర్శ‌లొస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప‌వ‌న్‌క‌ల్యాణ్ తాజాగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌జ‌ల నిర‌స‌న‌కు జ‌న‌సేన అండ‌గా ఉంటుంద‌ని ఆయ‌న…

చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పంద‌నా తీరు వుంద‌నే విమ‌ర్శ‌లొస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప‌వ‌న్‌క‌ల్యాణ్ తాజాగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌జ‌ల నిర‌స‌న‌కు జ‌న‌సేన అండ‌గా ఉంటుంద‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్ర‌భుత్వం రెండు నెల‌ల క్రితం ఒక ప్ర‌క‌ట‌న ఇచ్చింది. వీటికి సంబంధించి ఏవైనా అభ్యంత‌రాలుంటే చెప్పాల‌ని స‌మ‌యం ఇచ్చింది.

ఈ మేర‌కు ప్ర‌భుత్వం దృష్టికి వేలాది విన‌తులు, అభ్యంత‌రాలు వెళ్లాయి. వీటిలో స‌హేతుక‌మైన‌వ‌ని భావించిన వాటిని ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని, ఫైన‌ల్‌గా మార్పులు చేసింది. ఉదాహ‌ర‌ణ‌కు తిరుప‌తి కేంద్రంగా బాలాజీ జిల్లాను ప్ర‌క‌టించారు. అయితే ఉత్త‌రాధి సంస్కృతిని ప్ర‌తిబింబించే బాలాజీ పేరు తొల‌గించి, తిరుప‌తి పేరే పెట్టాల‌నే డిమాండ్లు ప్ర‌భుత్వ దృష్టికి వెళ్లాయి. దీన్ని ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని తిరుప‌తి జిల్లాగా ప్ర‌క‌టించి, ఇవాళ ప్రారంభించింది.

నిజంగా ప్ర‌జ‌ల అకాంక్ష‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లిన‌ట్టైతే, త‌ప్ప‌క ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని అందుకు త‌గ్గ‌ట్టు మార్పులు చేసింది. కొన్నిచోట్ల చేయ‌లేక పోయి ఉండొచ్చు. స‌హ‌జంగానే ఒక‌ట్రెండు చోట్ల రాజ‌కీయ కార‌ణాల‌తో కొత్త జిల్లాల ఏర్పాటు విష‌యంలో ప్ర‌భుత్వం ముందుకెళ్లి ఉండొచ్చు. ఉదాహ‌ర‌ణ‌కు క‌డ‌ప జిల్లా రాజంపేట‌. రాయ‌చోటి జిల్లా కేంద్రంగా అన్న‌మ‌య్య జిల్లాను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌డంపై పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. కానీ ప్ర‌భుత్వం త‌లొగ్గ‌లేదు. 

రాయ‌చోటి ఏమైనా తెలంగాణ‌లో ఉందా? వెనుక‌బ‌డిన రాయ‌చోటిని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించ‌డం ద్వారా ఎంతోకొంత ప్ర‌గ‌తి సాధించే అవ‌కాశం ఉంది. పార్ల‌మెంట్ కేంద్రాల‌ను జిల్లాలుగా ప్ర‌క‌టిస్తాన‌ని జ‌గ‌న్ హామీ రాజంపేట‌, హిందూపురం విష‌యాల్లో నెర‌వేర‌లేదు.

అంద‌రినీ సంతృప్తిప‌ర‌చ‌డం ఏ ప్ర‌భుత్వానికీ సాధ్యం కాదు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌కే అన్నీ కావాల‌ని కోరుకోవ‌డం స‌హ‌జం. దీన్ని త‌ప్పు ప‌ట్ట‌లేం. అయితే మెజార్టీ అభిప్రాయాల్ని, డిమాండ్ల‌లో న్యాయాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ప్ర‌భుత్వం తీసుకోవాలి. నిజంగా ప్ర‌భుత్వం అన్యాయంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న అంశాల‌పై జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పోరాటం చేయ‌కుండా, ఇప్పుడు కొత్త జిల్లాల‌ను ప్రారంభించిన త‌ర్వాత స‌న్నాయి నొక్కులు నొక్క‌డం ఏంటి? అనే ప్ర‌శ్న‌లొస్తున్నాయి.

ఏదో జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించాలి కాబ‌ట్టి, రెండు మాట‌లు అన్న‌ట్టుగా ఆయ‌న కామెంట్స్ ఉన్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పాల‌కుల చిత్తానికి తోచిన విధంగా ముందుకెళ్లార‌ని ప‌వ‌న్ విమ‌ర్శించ‌డంలో ఆయ‌న ఓర్వ‌లేని త‌నం క‌నిపిస్తోంది. హిందూపురం కంటే పుట్ట‌ప‌ర్తికి సాయిబాబా కార‌ణంగా ఎక్కువ పేరు ప్ర‌తిష్ట‌లున్నాయి. పుట్ట‌ప‌ర్తిని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించ‌డంలో ఎవ‌రికి, ఎక్క‌డ అన్యాయం జ‌రిగిందో ప‌వ‌న్‌కే తెలియాలి.

జిల్లాల విభ‌జ‌న‌లో కాదు, త‌న విమ‌ర్శ‌లు లోప‌భూయిష్టంగా ఉన్నాయ‌ని ప‌వ‌న్ గ్ర‌హిస్తే మంచిది. గిరిజ‌నుల సంక్షేమం విష‌యంలో జ‌గ‌న్ కంటే ఎవ‌రూ గొప్ప‌గా ఆలోచించ‌రు. మ‌న్యం జిల్లాను ఏర్పాటు చేయ‌డంలోనూ, అల్లూరి సీతారామరాజు పేరు పెట్ట‌డంలోనూ గిరిజ‌నుల‌పై జ‌గ‌న్ అభిమానం, నిబ‌ద్ధ‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. వాటిని వ‌దిలేసి జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డం అంటే, ప‌వ‌న్ రాంగ్ రూట్‌లో వెళుతున్న‌ట్టు అర్థం చేసుకోవాలి.