వేసుకున్నవారికి వేసుకున్నంత మహదేవా అన్నట్లు పోటా పోటీగా ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు అంటూ ప్రెజెంట్ చేసేస్తున్నారు డైలీ అదే పనిగా. మరో అడుగు ముందుకు వేసి ఈ రోజు ఇంత వచ్చే అవకాశం వుందీ అంటూ కూడా జ్యోతిష్యం చెప్పేస్తున్నారు. కానీ ఇవన్నీ చూసి ఫ్యాన్స్ మురిసి పోవచ్చు కానీ, ఇండస్ట్రీ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.
అసలు లెక్కలు తెలిసినా, గుసగుసలాడుకుంటూ గమ్మున వున్నారు. గ్రాస్ నుంచి ఖర్చు తీసి నెట్ తేల్చి అదే షేర్ కింద చలామణీ చేసేస్తున్నారు. ముందుగా వచ్చిన ఫిక్స్ హయర్లు వగైరా కలిపేసి, మళ్లీ డైలీ కలెక్షన్లు యాడ్ చేసేస్తున్నారు. మొత్తం మీద ఆర్ఆర్ఆర్ ను బ్రేక్ ఈవెన్ కు చేర్చేయాలి. అదే లక్ష్యం.
ఒకప్పుడు మగధీరకు ఒక్క కలెక్షన్ పోస్టర్ వేస్తే అల్లు అరవింద్ మీద అలిగానని చెప్పిన రాజమౌళి ఇప్పుడు రోజూ వదులుతున్న పోస్టర్లు చూసి ఏమనుకుంటున్నారో? ఎవరి మీద అలగాలనుకుంటున్నారో? సరే ఈ లెక్కలు రాజమౌళి పరువు నిలబెడుతున్నాయి అనుకుంటే..సంతోషమే. ఆయనకు తెలియదా అసలు లెక్కలు?
ఉత్తరాంధ్ర నిన్నటికి 25.50 కోట్లు చేసిందని ఇండస్ట్రీ వర్గాల బొగట్టా. ఏకంగా 30 కోట్లకు పైగా చూపించేస్తున్నారు. ఇంక ఏం చెప్పాలి. ఇలా నిజం చెబితే, విరుచుకుపడడం తప్ప అధికారికంగా చూపించే నాధుడు లేడు. నైజాం ఏకంగా 100 కోట్లకు చేర్చేసారు. 80 దాటలేదని ఆఫ్ ది రికార్డ్ గా తెలుస్తున్న విషయం.
చిన్న ఉదాహరణ. భీమ్లా నాయక్ భయంకరంగా వసూలు చేస్తే, గతంలో సరిలేరు నీకెవ్వరు అంతకన్నా బ్లాక్ బస్టర్ అనుకుంటే నైజాం ఏరియాకు సర్కారువారి పాట జస్ట్ 30 కోట్లు ప్లస్ జీఎస్టీ కి ఎందుకు విక్రయించాలి? 35 ప్లస్ జీఎస్టీ కి విక్రయించవచ్చు కదా?
గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి బ్రేక్ ఈవెన్ కు ఇంకా ఇవతలే వున్నాయి. నెల్లూరు, వెస్ట్ ముందుగా బ్రేక్ ఈవెన్ అవుతాయని తెలుస్తోంది. ఈస్ట్ బ్రేక్ ఈవెన్ కావడానికి కాస్త టైమ్ పడుతుంది.
పాపం..సాయి కొర్రపాటి
కర్ణాటక-సీడెడ్-ఉత్తరాంధ్ర ఒకరే బయ్యర్. అయితే ఆయన కర్ణాటకలో ముఫై శాతం వుంచుకుని మిగిలినది ప్రాఫిట్ అమ్మేసారు. దాంతో ఇప్పుడు 15 కోట్ల నష్టం వస్తుంటే దీని వల్ల జస్ట్ ఒకటి రెండు కోట్లనష్టంతో సరిపెట్టుకోగలిగారు.
ఉత్తరాంధ్రలో ఓ మూడు నాలుగు కోట్లు లాభం రావచ్చు అని అంచనా. కానీ మేరకు సీడెడ్ లో ఎగిరిపోయేలా వుంది. అంటే దాదాపు రెండేళ్లు టెన్షన్ పడి, అడ్వాన్స్ లు ఇచ్చి, ఖర్చులు పెట్టుకుని, మూడు పెద్ద ఏరియాల డిస్ట్రిబ్యూషన్ సంపాదిస్తే మిగిలింది ఏమిటి?
కర్ణాటకలో భాగస్వామి అయిన ఆసియన్ సునీల్ తెలివిగా ముందుగా ఆయన వంతు యాభై శాతం వాటా అయిదు కోట్లు లాభం తీసుకుని వదలుకున్నారు. ప్రాపిట్ అందుకున్నారు. వెస్ట్ గోదావరిలో ముగ్గురు పార్టనర్ లు, ఈస్ట్ గోదావరి లో ఇద్దరు భాగస్వాములు కావడం వల్ల ఖర్చులు, వడ్డీలు రాకపోతున్నా తట్టుకున్నారు.
ఇదేదో మామూలు సినిమా అన్నట్లుగా, బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. జీఎస్టీ వచ్చేసింది…ఖర్చులు రాకపోయినా ఓకె లాంటి కబుర్లు చెబుతున్నారు. ఇద్దరు హీరోలు, రెండు ప్రాంతాల కథ, రాజమౌళి సినిమా అన్న సంగతి మరిచిపోతున్నారు. కోట్లకు కోట్లు బయ్యర్లు కట్టిన వడ్డీలు గాలికి వదిలేసారు. ఖర్చుల సంగతి సరేసరి. మొత్తం మీద ఆర్ఆర్ఆర్ ను అంకెల్లో అందలం ఎక్కించేస్తున్నారు.