దాదాపు తొమ్మిదేళ్లు దాటి పదో ఏడు రాబోతోంది. రామయ్యా వస్తావయ్యా సినిమాకు. దిల్ రాజు నిర్మాత. హరీష్ శంకర్ దర్శకుడు. ఈ ఫ్లాప్ తరువాత మళ్లీ ఇంత వరకు దిల్ రాజు-ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ ఏడు సినిమాలు చేసారు.
దిల్ రాజు అయితే లెక్కకు ఎక్కువ సినిమాలే నిర్మించారు. కానీ ఆ కాంబినేషన్ మాత్రం మళ్లీ సెట్ కాలేదు. ఎవడు తరువాత చరణ్ తో మళ్లీ సినిమా ఇన్నాళ్లకు సెట్ అయింది. ఇక్కడ కూడా గ్యాప్ దగ్గర దగ్గర తొమ్మిదేళ్లు. బన్నీ తో దువ్వాడ జగన్నాధం సినిమా చేసాక మళ్లీ కాంబినేషన్ సెట్ కాలేదు. ఐకాన్ ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో మళ్లీ ఎన్టీఆర్ కోసం దిల్ రాజు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మాస్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా అందించే అనిల్ రావిపూడి ప్రస్తుతం దిల్ రాజు ఆస్థానంలోనే వున్నారు. ఆయనతో ఎన్టీఆర్ సినిమా సెట్ చేయించడానికి ప్రయత్నాలు షురూ అయ్యాయి.
అయితే ప్రస్తుతానికి ఎన్టీఆర్ ఇటు కొరటాల సినిమా, అటు బుచ్చిబాబు సినిమా కమిట్ అయి వున్నారు. ఈ రెండింటి తరువాత అనిల్ రావిపూడికి చాన్స్ వస్తే దిల్ రాజు మళ్లీ ఎన్టీఆర్ కు దగ్గరయినట్లే.