అవును. అది అందమైన జిల్లా. ఏపీలోనే కాదు, దేశంలోనే చాలా తొందరలో అద్భుతమైన జిల్లాగా కూడా మారనుంది. కొత్త జిల్లాల కూర్పుతో అందమంతా ఒక్క చోటే పోగేసుకుంది. ఆ జిల్లా పేరు అల్లూరి సీతారామరాజు జిల్లా.
విశాఖ జిల్లా నుంచి వేరుపడి పాడేరు జిల్లా కేంద్రంగా ఏర్పాటు అయిన అల్లూరి జిల్లా ఇపుడు అందమైన జిల్లాగా అగ్ర స్థానంలో నిలవనుంది. అల్లూరి జిల్లాలో ఆంధ్రా ఊటీ అరకు ఉంది. అలాగే ఆంధ్రా కాశ్మీర్ లంబసింగి ఉంది.
ఈ రెండూ సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్సులుగా తరాలుగా కొనసాగుతున్నాయి. దేశం మొత్తం మీద నుంచి ఇక్కడికి పర్యాటకులు వెల్లువలా వస్తూంటారు. ఇక జలపాతాలు, పచ్చని ప్రకృతి అంతా అల్లూరి జిల్లా సొంతం. మరో వైపు చూస్తే వైసీపీ సర్కార్ వస్తూనే కొత్తగా పదహారు మెడికల్ కాలేజీలను ఏపీ అంతటా ఏర్పాటు చేసింది. అందులో ఒక మెడికల్ హాస్పిటల్ అల్లూరి జిల్లాకు చాలా కాలం క్రితమే మంజూరు అయింది.
ఇక మూడు నెలల క్రిత్రం నుంచి అల్లూరి జిల్లాలోని ఆసుపత్రులలో శస్త్ర చికిత్సలు కూడా చేస్తున్నారు. ఆ యూనిట్ ని ప్రారంభించారు. ఇక కాఫీ ఇండస్ట్రీ ఇక్కడ ఉంది. అంతర్జాతీయంగా పేరు గడించిన అరకు కాఫీతో అల్లూరి జిల్లాకు ఆర్ధిక బలం సొంతం కానుంది. అలాగే వాణిజ్య పంటలతో పాటు, ఇతర ప్రకృతి సంపద కూడా ఈ జిల్లాకు వరాలు.
టోటల్ గా చూస్తే కొత్త జిల్లాల కూర్పుతో ఒక అందమైన జిల్లాకు వైసీపీ సర్కార్ ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టింది అనుకోవాలి.