సలార్ మీద నమ్మకం ఎంత వరకు?

ఏ సినిమా మీద కూడా ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు. అంచనాలను ఏ మాత్రం అందుకోకున్నా నిరాశ అవుతుంది. ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలయింది. జనాలకు నచ్చేసింది. కేజిఎఫ్ 2…

ఏ సినిమా మీద కూడా ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు. అంచనాలను ఏ మాత్రం అందుకోకున్నా నిరాశ అవుతుంది. ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలయింది. జనాలకు నచ్చేసింది. కేజిఎఫ్ 2 ను చూపి పెదవి విరిచిన వారూ వున్నారు. ఆ ఎలివేషన్లు నచ్చిన వారూ వున్నారు. కథ లేదని ఎలివేషన్లు మాత్రమే వున్నాయని కొందరు. ఎలివేషన్నే ఆ సినిమాకు అందం అని మరి కొందరు ఇలా కామెంట్లు వచ్చాయి. ఏమైతేనేం ఆ సినిమా పెద్ద హిట్.

అప్పటి నుంచి తెలుగు సినిమా ప్రేక్షకులు ప్రశాంత్ నీల్ కు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. ప్రభాస్ – నీల్ సినిమా మీద గంపెడాశలు పెట్టుకున్నారు. నిజానికి ఆదిపురుష్ విడుదల వేళకు భారీ హైప్ వచ్చింది కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ఆ సినిమా ను ఎక్కువగా నమ్ముకోలేదన్నది వాస్తవం. నీల్ సినిమా సలార్ ఎప్పుడు వస్తుందా అనే ఎదురు చూపులు.

ప్రశాంత్ నీల్ తప్పకుండా ఏదో చేస్తారు. బ్యాడ్ మూవీ అయితే తీయరు. ఇది అందరి అంచ‌నా. కానీ ఇంతకీ సలార్ కథ ఎలా వుంటుంది? సినిమాలో పృధ్వీరాజ్ కూడా వున్నారు. అతను కూడా పాన్ ఇండియా నటుడే. అందువల్ల కథలో అతనికీ కీలకపాత్ర వుండాల్సిందే. అది హీరో ప్రభాస్ తో సమానంగా వున్నా ఆశ్చర్యపోనక్కరలేదు.

సలార్ కథ మీద రకరకాల గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. సినిమా మొదటి నలభై నిమిషాలు ఎక్కువగా పృధ్వీరాజ్ మీదే వుంటుందని టాక్ వినిపిస్తోంది. అలాగే హీరో ప్రభాస్ తొలిసగం ముగిసే వరకు ఫైట్ అన్నది చేయడని మరో టాక్ వినిపిస్తోంది. అలాగే ద్వితీయార్థం లో రెండు బ్లాక్ లు బాగా వచ్చాయని మరో టాక్.

ఏ దర్శకుడు బ్యాడ్ మూవీ తీయాలని అనుకోడు. కానీ మల్టీ స్టారర్ అనుకున్నపుడు, ప్యాన్ ఇండియా సినిమా అయనపుడు, దర్శకుల ఆలోచనలు వేరుగా వుంటాయి. అలాగే కథను పట్టి పాత్రలు, వాటి నిడివి వుంటాయి. అవన్నీ పండితే సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది.

అలా కాకుండా మన హీరో, మన ప్రభాస్ అనే కోణంలో చూడడం, ముందుగానే ప్రశాంత్ నీల్-కేజిఎఫ్ సిరీస్ లెవెల్ లు లెక్కలు కట్టుకుని, మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే అవి అందుకోకపోతే వేరుగా వుంటుంది.

సలార్ సంగతి ఎలా వున్నా, ప్రాజెక్ట్ కే మాత్రం బుల్స్ ఐ ను కొట్టడం పక్కా అనేసుకోవచ్చు. ఎందుకంటే దాని స్టార్ కాస్ట్, దాని సబ్జెక్ట్, అన్నింటికి మించి ద‌ర్శకుడు నాగ్ అశ్విన్ ప్లానింగ్ వేరుగా వుంటుంది. హడావుడి వుండదు. హైప్ వుండదు. సినిమా సత్తా థియేటర్లోకి వచ్చాక తెలుస్తుంది. అదీ అతని స్టయిల్.

అయినా కూడా మళ్లీ మొదట చెప్పిందే.. ఏ సినిమా మీద కూడా ఫ్యాన్స్ ఓవర్ అంచనాలు పెట్టుకోకుండానే చూడాలి. అప్పుడే పక్కాగా నచ్చేసే అవకాశం వుంటుంది.