ద్వారంపూడి వెర్సస్ పవన్ కల్యాణ్ జరుగుతున్న విమర్శల యుద్ధంలో జోక్యం చేసుకుని పవన్ కల్యాణ్ విమర్శల తీరును తప్పుపట్టినందుకు సీనియర్ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఆయనను అత్యంత అసభ్య పదజాలంతో దూషిస్తూ పవన్ అభిమానులు పోస్టులు పెడుతున్నట్టుగా, తనకు మెసేజీలు పెడుతున్నట్టుగా ముద్రగడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాకు సొంత అభిప్రాయాలు ఉండకూడదా? వాటిని నేను వ్యక్తం చేయకూడదా? మీ అభిమానులతో నన్ను అసభ్యంగా తిట్టిస్తే భయపడి లొంగిపోతానని అనుకుంటున్నారా? అని ప్రశ్నిస్తూ ముద్రగడ పద్మనాభం పవన్ కల్యాణ్ కు మరొక లేఖ కూడా రాశారు.
తనను అనుచరులతో బండబూతులు తిట్టించడం మగతనం కాదని, పవన్ అంటే సినిమా హీరోనే తప్ప రాజకీయాల్లో హీరో కాదని తెలుసుకోవాలని ముద్రగడ అన్నారు. కాకినాడలో ద్వారంపూడి మీద పోటీచేయడానికి ధైర్యం లేకపోతే పిఠాపురంలో తనమీద పోటీచేసి నెగ్గాలని పవన్ కల్యాణ్ కు ముద్రగడ సవాలు విసిరారు.
పవన్ కు ముద్రగడ తొలిలేఖ రాసినప్పటి నుంచి పవన్ అభిమానులు ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ముద్రగడకు మనీయార్డర్లు పంపుతున్నారు. బూతులు తిడుతూ మెసేజీలు పెడుతున్నారు. వీటిపట్ల ఆవేదనతో ముద్రగడ తాజా లేఖ రాసినట్టుగా తెలుస్తోంది.
ఆ విషయాలన్నీ పక్కన పెడితే.. తనను ఎవరు పల్లెత్తు మాట అన్నా సరే.. వారిని అసహ్యకరమైన రీతిలో బూతులు తిట్టించడం అనేది పవన్ కల్యాణ్ కు వెన్నతో పెట్టిన విద్య అని పలువురు విమర్శిస్తున్నారు. గతంలో ఇలాంటిదే పోసాని కృష్ణమురళి వ్యవహారంలో జరిగిన రాద్ధాంతాన్ని పలువురు గుర్తుచేస్తున్నారు. పవన్ ను విమర్శించినందుకు పోసాని కృష్ణమురళి భార్యను ఉద్దేశించి పవన్ కల్యాణ్ అభిమానులు అసహ్యకరమైన, అసభ్యమైన పోస్టులు వెల్లువలా పెట్టిన సంగతి తెలిసిందే. పోసాని పర్సనల్ మొబైల్ నెంబరుకు కూడా వేల సంఖ్యలో మెసేజీలు పెడుతూ ఇబ్బంది పెట్టారు. ఈ అసభ్య మెసేజీలపై పోసాని స్వయంగా ప్రెస్ మీట్ లో కన్నీరు పెట్టుకున్నారు కూడా.
పవన్ కల్యాణ్ అభిమానులుగా చెలామణీ అవుతున్న వాళ్లు ఇప్పుడు కూడా ముద్రగడ విషయంలో అలాంటి అసహ్యకరమైన, అసభ్యమైన మెసేజీల యుద్ధాన్ని ప్రకటించినట్టుగా కనిపిస్తోంది. తనను నిందించిన రాజకీయ ప్రత్యర్థులను తన అభిమానులు ఇలా బూతులు తిడుతూ, అసభ్యంగా తూలనాడుతూ ఉంటే ఆ పోకడలను పవన్ ఎంజాయ్ చేస్తుంటారేమో అని పలువురు విమర్శిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు తలెత్తినప్పుడు.. బాధ్యతగల నాయకుడిగా.. పవన్ కల్యాణ్ తన అభిమానులకు ఖచ్చితంగా పిలుపు ఇవ్వాలి.
అసభ్యంగా తిట్టడం, మహిళలను వివాదంలోకి లాగుతూ కామెంట్లు చేయడం కరెక్టు కాదని నాయకుడు స్వయంగా చెప్పాలి. కానీ పవన్ ఎన్నడూ అలా తన అభిమానులను ఉద్దేశించి చెప్పిన సందర్భాలు లేవు. అందుకే ముద్రగడను తిడుతున్నా.. ఆయన మౌనంగా వేడుక చూస్తున్నారని.. తప్పు చేస్తున్నది అభిమానులే అయినా.. అలాంటి పెడపోకడల వల్ల పోయేది తన పరువే అని పవన్ తెలుసుకోవాలని ప్రజలు అంటున్నారు.