క‌ట్నం, డ‌బ్బు కోసమ‌ని పెళ్లి చేసుకుంటే..!

ఫైనాన్షియ‌ల్ గా సెటిల‌వ్వ‌డానికి పెళ్లి చేసుకోవ‌డం కూడా ఒక మార్గ‌మా! ద‌శాబ్దాలుగా ఇంకా చెప్పాలంటే అమ్మాయిల విష‌యంలో ఈ ఐడియా అయితే బాహాటంగానే స‌మ‌ర్థ‌న‌కు గుర‌వుతున్న అంశం! త‌మ కూతురును ఉన్న‌వాళ్లింటికి ఇచ్చి చేయాల‌ని…

ఫైనాన్షియ‌ల్ గా సెటిల‌వ్వ‌డానికి పెళ్లి చేసుకోవ‌డం కూడా ఒక మార్గ‌మా! ద‌శాబ్దాలుగా ఇంకా చెప్పాలంటే అమ్మాయిల విష‌యంలో ఈ ఐడియా అయితే బాహాటంగానే స‌మ‌ర్థ‌న‌కు గుర‌వుతున్న అంశం! త‌మ కూతురును ఉన్న‌వాళ్లింటికి ఇచ్చి చేయాల‌ని ఆలోచించ‌ని త‌ల్లిదండ్రులు ఉండ‌రు! ఆర్థికంగా సెటిలైన ఫ్యామిలీ, అబ్బాయికి మంచి జీతం వ‌చ్చే ఉద్యోగం, ఫైనాన్షియ‌ల్ గా చీకూచింత లేని కుటుంబానికే అమ్మాయిని ఇవ్వాల‌ని అంతా అనుకుంటారు. ఇదే జ‌రుగుతుంది కూడా! ఆర్థికంగా త‌మ‌క‌న్నా త‌క్కువ అనే వారి ఇంటికి పిల్ల‌ను ఇచ్చే వాళ్లు బ‌హు అరుదు!

అమ్మాయిల విష‌యంలో ఇది ప్ర‌తి ఒక్క‌రూ స‌మ‌ర్థించే సిద్ధాంత‌మే! త‌మ కూతురును ఉన్న వాళ్ల‌కు ఇచ్చి చేయాల‌నుకునే త‌ల్లిదండ్రుల‌ను కొంద‌రు త‌ప్పు ప‌ట్టే వారూ ఉండొచ్చు! అయితే వారి వ‌ర‌కూ వ‌స్తే.. వారి అమ్మాయిల‌ను మ‌ళ్లీ అలా ఫైనాన్షియ‌ల్ గా సెటిలైన కుటుంబాల‌కే పంపుతారు! హిపోక్ర‌సీతో కొంత మాట్లాడ‌తారు కానీ, త‌మ వ‌ర‌కూ వ‌స్తే డ‌బ్బు చాలా కీల‌క‌మైన అంశం అనిపిస్తుంది!

అయితే ఈ మ‌ధ్య‌కాలంలో అమ్మాయిల‌కు మ‌రింత అవ‌కాశం కూడా వ‌చ్చింది. గ‌తంలో డ‌బ్బుంటే చాలు అబ్బాయి ఎలా ఉన్నా ఫ‌ర్వాలేద‌నే అభిప్రాయాలూ ఉండేవి. అయితే రోజులు మారాయి, డ‌బ్బు ఎంతున్నా… అబ్బాయి అందం గురించి కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటూ ఉన్నారు. వారికి ఛాయిస్ ఉన్న నేప‌థ్యంలో.. ఇది చెల్లుబాటు అయ్యే ప‌రిస్థితీ ఉంది!

మ‌రి అబ్బాయిల్లో కూడా కొంద‌రికి ఆర్థికంగా త‌మ క‌న్నా పై స్థాయి వారి సంబంధాలు దొరికే పరిస్థితీ అక్క‌డ‌క్క‌డ ఉంటుంది! మంచి ఉద్యోగ‌మో, ల‌వ్ మ్యారేజో ఇంకా ఏదో కార‌ణం చేతో… అబ్బాయిల‌కు ఇలాంటి అవ‌కాశాలు వ‌స్తూ ఉంటాయి. మ‌రి అలాంటి వారిలో ఏదైనా క‌న్ఫెష‌న్ లాంటిది ఉంటుందా? అనేది ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం!

ఆర్థికంగా త‌మ క‌న్నా పై స్థాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవ‌డం లేదా త‌న క‌న్నా ఎక్కువ జీతం వ‌చ్చే అమ్మాయిని పెళ్లి చేసుకోవ‌డం, కుటుంబ ప‌రంగా వారికి త‌మ క‌న్నా చాలా ఎక్కువ ఆస్తులు ఉండ‌టం.. వంటివి జ‌రిగిన‌ప్పుడు వైవాహిక బంధంలో అబ్బాయిల పరిస్థితి ఏమిటనే అంశం గురించి అలాంటి వారినే ఆరా తీస్తే, ఇదేమీ పెద్ద ఇబ్బందిక‌ర‌మైన అంశం కాలేద‌ని వారు అంటున్నారు!

ఇందులో క‌న్ఫెష‌న్స్ ఏమీ లేవ‌ని.. త‌న భార్య లేదా ఆమె కుటుంబం త‌న క‌న్నా లేదా త‌మ కుటుంబం క‌న్నా ఆర్థికంగా పై స్థాయిలో ఉండ‌టం అనేది త‌మ‌కు అద‌న‌పు అవ‌కాశ‌మే అని ఇందులో చిన్న‌బుచ్చుకోవ‌డం ఏమీ లేద‌ని స‌ద‌రు వ్య‌క్తులు చెప్పారు! తాము త‌మ భార్య వైపున బాగా డ‌బ్బుంద‌నే చేసుకున్నామ‌నే చెప్ప‌గ‌లిగే వారూ ఉన్నారు! డ‌బ్బు క‌లిసొస్తుంద‌ని పెళ్లి చేసుకున్నామ‌ని దీని వ‌ల్ల ఫైనాన్షియ‌ల్ సెక్యూరిటీ ల‌భించింద‌ని వారు ఓపెన్ గానే చెబుతున్నారు.

ఎలాంటి వారిని పెళ్లి చేసుకున్నా… వైవాహిక బందంలో స‌ర్దుకుపోవ‌డం త‌ప్ప‌నిస‌రి! అంద‌గ‌త్తెను చేసుకున్నా, ఆద‌ర్శ వివాహం చేసుకున్నా.. ఎలాంటి పెళ్లిలో అయినా స‌ర్దుకుపోవాల్సిన అంశాలు త‌ప్ప‌నిస‌రిగా ఉంటాయి. అలాంట‌ప్పుడు ఆర్థికంగా స్థితిమంత‌మైన సంబంధం దొరికిప్పుడు అలా స‌ర్దుకుపోవ‌డం కూడా అలాంటిదే అని వారు చెబుతున్నారు. 

ఇన్ ఫిరియారిటీల‌కు గురి కాకుండా.. అలాంటి అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు ఆస్వాధించ‌డ‌మే మంచిద‌నే అభిప్రాయాలు డ‌బ్బున్న అమ్మాయిల‌ను పెళ్లి చేసుకున్న వారే అంటున్నారు!