స్పై సినిమా రిలీజ్ సందర్భంగా నిర్మాత రాజశేఖర్ రెడ్డి, హీరో నిఖిల్ మధ్య జరిగిన గొడవ గురించి అందరికీ తెలిసిందే. క్వాలిటీ కోసం, సినిమాను పాన్ ఇండియా లెవెల్లో ప్రమోట్ చేయడం కోసం విడుదలను వాయిదా వేయమన్నాడు నిఖిల్. అలా చేస్తే చాలా నష్టం వస్తుంది కాబట్టి కుదరదన్నాడు నిర్మాత.
నిఖిల్ తో సంబంధం లేకుండానే లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. అతడితో సంబంధం లేకుండా మరోసారి రిలీజ్ డేట్ పోస్టర్ కూడా వదిలారు. తప్పనిసరి పరిస్థితుల మధ్య నిర్మాత దారిలోకి వచ్చాడు నిఖిల్. ట్రయిలర్ రిలీజ్ సందర్భంగా దీనిపై స్పందించాడు.
“నిజమే.. మేం కొట్టుకున్నాం, తిట్టుకున్నాం. ఏం చేసినా అన్నీ సినిమా కోసమే. ఇప్పుడంతా ఓకే. నిర్మాతను నేను ఒకటే కోరాను. 250 రూపాయలు పెట్టి థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడ్ని ఎంటర్ టైన్ చేయాలి. ఇది మంచి సినిమా, అందుకే టైమ్ తీసుకుందామని కోరాను. కానీ క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదు. ఏమాత్రం క్వాలిటీ లేకపోయినా మార్నింగ్ షో తర్వాత ఆడియన్స్ ఉండరు. మేం ఆ పని చేయలేదు. ఈ విషయంలో దర్శకనిర్మాతలు నన్ను శాటిస్ ఫై చేశారు. నేను తృప్తి చెందాను కాబట్టే, ఇప్పుడు మీడియా ముందుకు స్వచ్ఛందంగా, ధైర్యంగా వచ్చాను.”
సినిమా ప్రమోషన్ కు తక్కువ టైమ్ ఉందనే విషయాన్ని అంగీకరించిన నిఖిల్.. స్పై మూవీ రిలీజైన తర్వాత కూడా ప్రచారం చేస్తామన్నాడు. కార్తికేయ-2కు కూడా అలానే చేశామని, స్పై విషయంలో కూడా అదే పద్ధతి ఫాలో అవుతామని తెలిపాడు.