తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి జనసేనాని పవన్ కల్యాణ్ ఫిక్సయిపోయారు. తన వారాహియాత్రలో ఊర్లు తిరుగుతున్న సమయంలో కూడా.. ఆయన ప్రతి మాట పొత్తులకు అనుకూలంగానే ఉంటోంది. చంద్రబాబు నాయుడు కూడా ప్రతిసారీ ఎవరో ఒకరి భుజాల మీద ఎక్కి అధికార పీఠంవైపు సవారీ చేయాలని అనుకుంటారు కాబట్టి.. ఈ పొత్తులను కోరుకుంటున్నారు.
కానీ ఇరు పార్టీల్లోనూ ఇతర నాయకులు ఈ పొత్తుల పట్ల అంతే సుముఖంగా ఉన్నారా? అసలు పవన్ కల్యాణ్ తీరు తెన్నులు, ఆయన రాజకీయ ప్రస్థానం పట్ల తెదేపా సీనియర్ నాయకుల్లో సానుకూల అభిప్రాయం ఉన్నదా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. దీనికి తగ్గట్టుగా, పాయకరావు పేటనుంచి టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లాల బస్సుయాత్ర ప్రారంభం సందర్భంగా సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణ మూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం.
ఆ ఇద్దరు అన్నదమ్ములు చిరంజీవి, పవన్ కల్యాణ్ వల్లనే తెలుగుదేశం పార్టీ రెండుసార్లు ఓడిపోయిందని బండారు ఈ కార్యక్రమంలో అన్నారు. వీరు గెలవరు.. ఎదుటివాళ్లని గెలవనివ్వరు.. అన్న చందంగా పరిస్థితుల్ని తయారుచేసేశారని అక్కసు వెళ్లగక్కారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ముమ్మరంగా బరిలోకి దిగిన నేపథ్యంలో తెదేపా ఓడిపోయింది. 2019లో హఠాత్తుగా తెదేపాతో మైత్రిని వదలుకున్న పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీచేయడంతో వారికి దారుణమైన పరాభవం ఎదురైంది. ఈ మాటలు చూస్తే సీనియర్ నాయకుల్లో పవన్ కల్యాణ్ పట్ల ఎంత వ్యతిరేక అభిప్రాయం ఉన్నదో అర్థమవుతుంది.
పవన్ కల్యాణ్ ను ఎన్నికల్లో తాము గెలవడానికి వాడుకోవాలని, కాపు ఓటు బ్యాంకును ఆయన ద్వారా తమకు అనుకూలంగా మలచుకోవాలని తెలుగుదేశం పార్టీ వ్యూహరచన చేస్తున్నది. పవన్ కల్యాణ్ ఇప్పుడంటే.. తెలుగుదేశం పొత్తులపై స్పష్టత ఇచ్చేసి.. వారికి అనుగుణంగా తాను నడుచుకుంటున్నారు గానీ.. దాదాపు ఏడాది కిందటే.. పవన్ కల్యాణ్ పట్ల తనది వన్ సైడ్ లవ్ లాగా ఉన్నదని, ఆయన నుంచి రెస్పాన్స్ రావడం లేదని చంద్రబాబునాయుడు వాపోయిన వైనం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఆ ‘లవ్’ అనేది నిజాయితీతో కూడినదేనా? పవన్ ను అడ్డంగా వాడుకునే ఉద్దేశంతో ఉన్నదా? అనేదే ప్రజల సందేహం.
బండారు సత్యనారాయణమూర్తి లాంటి సీనియరల్ మాటలను గమనిస్తే.. పవన్ కల్యాణ్ పట్ల, కాపు సామాజిక వర్గం పట్ల ద్వేషంతో ఉన్నట్టుగా అర్థమవుతుంది. కడుపులో కత్తులు పెట్టుకుని పైకి కౌగిలించుకుంటున్నారేమోనని, ప్రేమను నటిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. తెలుగుదేశంలో బయటపడకుండా ఇలా పవన్ ను ద్వేషిస్తున్న నాయకులు ఇంకా ఎందరున్నారో తెలియదు.
జనసేన పొత్తుల్లో కొన్ని సీట్లు దక్కించుకుంటే.. అలాంటి చోట్ల ఈ నాయకులు వారికి ఏం చేటు చేస్తారో కూడా తెలియదని పలువురు విశ్లేషిస్తున్నారు.