ప్రభాస్ చెయ్యాల్సినదేంటి? చేస్తున్నదేంటి?

హీరోలు రెండు విధాలు:  Advertisement 1. “నా పని నటన మాత్రమే. దర్శకుడు చెప్పింది చేస్తాను. అంతకు మించి నేను మిగతా వాటిల్లో వేలు పెట్టను” అనుకునే టైప్.  2. “నా పని నటనే.…

హీరోలు రెండు విధాలు: 

1. “నా పని నటన మాత్రమే. దర్శకుడు చెప్పింది చేస్తాను. అంతకు మించి నేను మిగతా వాటిల్లో వేలు పెట్టను” అనుకునే టైప్. 

2. “నా పని నటనే. కానీ నా సినిమా ఆడేలా ఉండాలి. దర్శకుడి మీద నమ్మకం ఉన్నా అనుకున్నది తెర మీదకి వస్తోందా అనేది ఎప్పటికప్పుడు చూసుకుంటాను. నా పాత్రతో పాటు, ఇతరుల పాత్రలు, వాళ్ల క్యారెక్టర్ గ్రాఫ్, నిడివి అన్ని విషయల్లోనూ తలదూరుస్తాను. పరాజయవిజయాలు దైవాధీనాలని తెలిసినా మానవ ప్రయత్నంగా అన్నీ సక్రమంగా ఉండేట్టు చూసుకుంటాను”, అనుకునే రకం. 

వీళ్లల్లో సాధారణంగా రెండో రకమే ఎక్కువగా ఉంటారు. 

మొదటిరకం వాళ్లు మనకు అంతగా తెలియరు. వాళ్లు సరైన దర్శకుడి చేతిలో పడిన లక్కువల్ల కొన్నాళ్లు మెరిసి అంతర్ధానమవుతారు. ఉదాహరణకి 1980లనాటి నరసింహరాజు. విఠలాచార్య పుణ్యమా అని ఆయన కొన్నాళ్లు హిట్లు కొట్టారు. తర్వాత తేలిపోయి నెమ్మదిగా కనుమరుగయ్యారు. ప్రభాస్ ని ఆయనతో పోల్చలేం కానీ చూస్తుంటే ఈ విషయంలో మాత్రం ఒక పారలెల్ గీయొచ్చు. రాజమౌళి పుణ్యమా అని పాన్-ఇండియా స్టార్ అయ్యాడు. కానీ పైన చెప్పుకున్న మొదటి రకం హీరోలా ప్రవర్తించడం వల్ల కెరీర్ ని ఇబ్బంది పెట్టుకుంటున్నాడనిపిస్తోంది. 

బాహుబలి లాంటి సినిమా వచ్చాక దానికంటే కాస్తంత తక్కువ స్థాయిలో ఉన్నా జనం పెద విరిచేసే అవకాశంలేకపోలేదు. కానీ సాహో, రాధే శ్యాం, ఆదిపురుష్ విషయంలో అజాగ్రత్త ఎక్కువగా కనిపిస్తుంది. కథ రాసుకోవడం నుంచి, స్క్రీన్ ప్లే వరకు, డైలాగ్ నుంచి పాటల వరకు అన్నీ కేర్లెస్ గా తీసినట్టే ఉంటాయి. అలాగని ఎవ్వరూ కావాలని కేర్లెస్ గా తీయరు. ప్రభాస్ లాంటి హీరోతో చేసినప్పుడు ఈ రేంజ్ గ్రాఫిక్స్ ఉండాలి, ఈ రేంజ్ యాంబియన్స్ ఉండాలి అని అనుకుని రకరకాల ఆర్భాటాలకి కోట్లు ఖర్చు చేస్తారు. అవి కృతకంగా ఉండి తెరకెక్కాక చిరాకు పెడతాయి. అయినా కూడా బాగా ఖర్చుపెట్టినందువల్ల వాళ్లు గొప్పగా ఫీలయ్యి వాటిని కత్ చేయకుండా అలాగే ఉంచేయొచ్చు. అలాగే స్క్రీన్ ప్లేలో ఎమోషన్ పాళ్లు సరిపడా ఉన్నాయా లేదా అనే రాజమౌళి తరహా చెకింగ్ చెయ్యరు. హీరో తన పని తాను చేసేసి అందర్నీ ఎంకరేజ్ చేస్తూ “గుడ్” అంటుంటే ఇక అలా ఫిక్స్ అయిపోయి తాము చేస్తున్నది అద్భుతమనే భావనలోకి వెళ్లిపోయే ప్రమాదాలు ఉంటాయి. 

కనుక ప్రభాస్ లాంటి భారీ నేషనల్ యాక్సెప్టెన్స్ ఉన్న హీరో  తన టీం కి ఇంటినుంచి వండించి తెచ్చిన భోజనాలు తినిపించడం కాదు…సినిమా అయ్యాక కొన్నవాళ్ల కడుపులు కొట్టకుండా ముందే జాగ్రత్తపడి తన సినిమా ఎలా తయారవుతోందో చూసుకుంటూ ఉండాలి. 

ఇంత ఘనమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఊరికేరాదు. దానిని నిలబెట్టుకోవాలంటే బేసిక్ జాగ్రత్త తీసుకోవాలి. 

అంతే కాదు, వ్యక్తిగతంగా ఏ హీరో అయితే ఒళ్లొంచి ఫిట్నెస్ మీద శ్రద్ధ పెడతాడో అతడిని జనం మరింత అభిమానిస్తారు. ఉదాహరణకి 57 ఏళ్ల షారుఖ్ ఖాన్ “ఫఠాన్” లో ఎలా ఉన్నాడు? గ్రాఫిక్స్ లో కవర్ చేయొచ్చు కదా అని ఫిట్నెస్ ఆపేసి పొట్ట పెంచలేదు కదా! అమీర్ ఖాన్ “దంగల్” కోసం ఎలాంటి షేపులోకొచ్చాడు? గ్రాఫిక్స్ ని ఆశ్రయించాడా? రాం చరణ్, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్..వీళ్లంతా జిమ్ముల్లో కష్టపడట్లేదా? ఆహారనియమాలు పెట్టుకోవడం లేదా? మరి 43 ఏళ్ల ప్రభాస్ ఎందుకు ఆ కోవలో ఉండట్లేదు? జుట్టు పోయినా, రంగు లేకపోయినా రజనీకాంత్ లాగ సర్దుకోవచ్చు. కానీ ఒళ్లు పెరిగితే మాత్రం హీరోయిజం నిలబడదు. 

ఇక ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు- సలార్, ప్రాజెక్ట్ కె, రాజా డీలక్స్. వీటి స్టిల్సేవైనా వచ్చాయా? అసలేంజరుగుతోందో కూడా తెలీదు. ఇక్కడ కూడా అనేకమైన ఉదాహరణలు చెప్పుకోవచ్చు. విజయ్ సినిమా “లియో” అని తమిళంలో వస్తోంది. ఒక స్టిల్, ఒక పాట వదిలి హీటెక్కించారు అరవ మార్కెట్లో. ఇక్కడ మహేష్ బాబు “గుంటూర్ కారం” టైటిల్ ఎనౌన్స్మెంట్ , ఆ తర్వాత ఒక పాట విడుదల చేసారు. ఆ సినిమా కోసం అప్పుడే ఒక వెయిటింగ్ మొదలెట్టేసారు. ఎప్పుడో రాబోతున్న విజయ్ దేవరకొండ సినిమా “ఖుషీ” నుంచి ఆల్రెడీ ఒక పాట “నా రోజా నువ్వే” ఎఫ్ఫెముల్లో మోగుతోంది, డిజిటల్ గా వైరల్ అవుతోంది. మొన్నటికి మొన్న శ్రీలీల పుట్టినరోజైతే ఆమె ప్రస్తుతం నటిస్తున్న ఆరేడు సినిమాల స్టిల్స్ వదిలారు. ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకోవాలి హీరో మీద బజ్ పెరగాలంటే. 

సినిమా ఫ్లాపులైనా ఓపెనింగ్స్ వస్తున్నాయి కాబట్టి స్టార్డం చెక్కుచెదరనట్టే అని ధైర్యంగా ఉంటున్నాడేమో ప్రభాస్. అది నిజమే కానీ శాశ్వతం కాదు. వరుసగా ఫ్లాప్స్ వస్తే సడెన్ గా ఆడియన్స్ పట్టించుకోవడం మానేస్తారు. ఉదాహరణ ఆర్జీవీ సినిమాలు. ఈయన సినిమాలకి రక్తచరిత్ర తర్వాత కూడా కొన్నాళ్లు ఓపెనింగ్స్ ఉండేవి. ఇప్పుడు అస్సలు లేవు. ఆయన ఫ్యాన్సే ఆయన్ని పూర్తిగా లైట్ తీసుకుని వదిలేసారు. ఆ ప్రమాదం రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభాసుదే. 

తనకి జడ్జ్మెంట్ లేకపోతే అది ఉన్న తన మిత్రులని కూర్చోబెట్టాలి. ప్రతి విషయం ఆద్యంతం సీరియస్ గా తీసుకుని పరిశీలించాలి. చిరంజీవి వెనుక అల్లు అరవింద్ లాగ ఒక బ్రెయిన్ / కొన్ని బ్రెయిన్స్ ప్రభాస్ కెరీర్ కోసం పని చెయ్యాలి… అన్నీ తానే చూసుకోలేడు కాబట్టి. 

ఆ విధంగా శరీరం పరంగా, ఒప్పుకునే స్క్రిప్ట్స్ పరంగా, సినిమాలు తయారవుతున్న విధానం రిత్యా, వాటి పబ్లిసిటీ విషయంగా …ఇలా టోటల్ గా తాను చాలా కష్టపడాలి. అంతే తప్ప భోజనాలు పెట్టడం, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టడం కాదు. ఆకలితో అలమటించే అన్నార్తులకు పెట్టడం తప్పులేదు. అంతే కానీ సినిమా సెట్లోని వాళ్లకి పెట్టి ఆ పబ్లిసిటీని ఎంజాయ్ చేయడం ప్రభాస్ రేంజ్ హీరోకి సరికాదు! ఇవాళ భోజనం పెడితే ఇంకో పూటకి మళ్లీ ఆకలేస్తుంది. అలా కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనం ఆలోచించాలి. తన కెరీర్ బాగుంటే ఆటోమెటిక్ గా తనని నమ్ముకున్న అందరికీ ఆర్ధికంగా వనరులందుతాయి. ఇంకా ఎంతోమందిని ఆర్ధికంగా బలోపేతం చేయగలవాడౌతాడు. అప్పుడు ఎవరికి వాళ్లు ఎన్ని భోజనాలైనా తినగలరు. 

ఇది ప్రభాస్ మీద ప్రేమతో, అభిమానంతో రాస్తున్నదే తప్ప ఏ మాత్రం “డార్లింగ్” ని తక్కువ చేయడానికి కాదు. ప్రభాస్ తెలుగు సినిమాకి గర్వకారణం. అందులో సందేహం లేదు. ఆ గర్వాన్ని రానున్న ఏళ్లల్లో మరింతగా అనుభవించాలని కోరుకునే తెలుగువాళ్లల్లో నేనొకడిని. 

– శ్రీనివాసమూర్తి