జగన్ ఐడియా కాపీ.. బిజెపిది మినీ వెర్షన్!

అధికారంలో ఉన్నప్పుడు గడచిన పాలన కాలంలో తమ ప్రభుత్వం ప్రజలకోసం ఏం మేలు చేసిందో.. పార్టీ నాయకులు ఇంటింటికీ తిరిగి వారికి స్వయంగా తెలియజేయాలనేది ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుర్రలో పుట్టిన ఆలోచన.…

అధికారంలో ఉన్నప్పుడు గడచిన పాలన కాలంలో తమ ప్రభుత్వం ప్రజలకోసం ఏం మేలు చేసిందో.. పార్టీ నాయకులు ఇంటింటికీ తిరిగి వారికి స్వయంగా తెలియజేయాలనేది ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుర్రలో పుట్టిన ఆలోచన. ఆ ఆలోచననే ఆయన ‘గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్’ పేరుతో రాష్ట్రంలో కార్యరూపంలో పెట్టారు. 

పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యే కూడా.. తమ తమ నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ తిరిగి, ఆ కుటుంబానికి ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం ద్వారా ఏం లబ్ధి జరిగిందో తెలియజేయాలనేది ఈ కార్యక్రమ స్వరూపం. అచ్చంగా ఇదే ఆలోచనను బిజెపి కూడా కాపీ కొట్టింది. తొమ్మిదేళ్లలో కేంద్రప్రభుత్వం సాదించిన విజయాలను ఇంటింటికీ తిరిగి ప్రజలకు తెలియజేయాలని అనుకుంది. కాకపోతే.. జగన్ తన ఆలోచనను విశ్వరూపం లాగా అమలు చేస్తూ ఉంటే.. బిజెపి మినీ వెర్షన్ గా అమలు చేసింది. ‘ఇంటింటికీ బిజెపి’ పేరుతో ఒకరోజు కార్యక్రమంగా దీనిని గురువారం నిర్వహించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ లాగా.. కొన్ని నెలలపాటూ నియోజకవర్గంలో ప్రతి ఇంటినీ కలిసే ఆలోచన కాదు ఇది. కేవలం గురువారం ఒకేరోజు దీనిని నిర్వహించారు. పార్టీలోని ప్రతి కార్యకర్త తమ పోలింగ్ బూత్ పరిధిలోని కనీసం వంద కుటుంబాలను కలిసి, కేంద్రం సాధించిన అభివృద్ధి గురించిన కరపత్రాలను ఇవ్వడం, ఆ ఇంటికి స్టిక్కర్ అంటించడం.. యథాతథంగా జగన్ ఆలోచనలే కాపీ కొడుతున్నట్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మోడీ తొమ్మిదేళ్ల పాలనను సెలబ్రేట్ చేసుకుంటూ.. మహా సంపర్క్ అభియాన్ పేరుతు బిజెపి రకరకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. కేంద్ర మంత్రులను దేశమంతా తిప్పుతూ.. వివిధ ప్రాంతాల్లో బహిరంగసభలు కూడా నిర్వహిస్తూ వస్తోంది. అందులో భాగంగానే.. ఇంటింటికీ బిజెపి కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేశారు. 

తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగానే నిర్వహించినప్పటికీ.. కొందరు కీలక నాయకులు పాల్గొనలేదు. ఇటీవలే కాంగ్రెసు పార్టీ నుంచి బిజెపిలో చేరకిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ కార్యక్రమంలో కనిపించలేదు. తెలంగాణ వ్యాప్తంగా 35 లక్షల కుటుంబాలను కలవడం లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించారు.

పాలన కాలంలో సాధించిన ప్రగతికి సంబంధించి కరపత్రాలను ఇంటింటికీ పంచడం, ఇళ్లకు స్టిక్కర్ లు అంటించడం లాంటి ఆలోచనలను జగన్ ను చూసి కేంద్ర సర్కారు కాపీ కొట్టినట్టుగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానించడం విశేషం. కాకపోతే.. ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా ప్రతి ఇంటికీ తిరగాలన్నంత జగన్ కున్నంతటి చిత్తశుద్ధి వారికి లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.