అభివృద్ధికి అద్భుత సంకేతం భూముల ధర పెరుగుదల అని ఎవరు చెప్పారో తెలియదు. భూమి విలువ పెరిగితే పేదరికం పోతుందా. ఎంతమాత్రం పోదు, అంతే కాదు పేదలకు ఎపుడూ భూమి అందకుండా పోతుంది. అభివృద్ధిని కొలిచేది జీవన ప్రమాణాల పెరుగుదల బట్టి అన్నది నిపుణుల వాదనగా ఉంటుంది.
కానీ ఆధునిక రాజకీయ నేతలు భూముల ధరలు పెరుగుతున్నాయి కాబట్టి అభివృద్ధి సాధించేశామని అంటున్నారు. గతంలో చంద్రబాబు ఈ రకంగా బాజా కొట్టుకుంటే ఇపుడు బీఆర్ఎస్ కూడా అదే పంధాలో వెళ్తోంది. బీఆర్ఎస్ మంత్రులు తెలంగాణ భూములు అపురూపం, ఏపీలో భూముల ధరలు వెరీ పూర్ అని ఎన్నో సార్లు వెటకారం అడారు.
ఏపీలో భూముల ధరలు పడిపోయాయని చంద్రబాబు జగన్ని విమర్శిస్తూ అనేకసార్లు అన్నారు. లేటెస్ట్ గా మరోమారు అన్నారు. ఆయన అమరావతి రాజధాని అంటే సమీపంలో భూములు పెరిగి ఉండొచ్చు కానీ ఏపీలో ఏమి ఒరిగింది అన్న ప్రశ్నకు జవాబు ఉండదు, పైగా పెరిగే భూముల ధరలను కంట్రోల్ చేయాల్సిన పాలకులు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ల మాదిరిగా మాట్లాడితే అర్ధమేముంటుంది అన్నది సూటి ప్రశ్న.
తెలంగాణాలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో అయిదు ఎకరాలు కొనొచ్చు అన్నది కేసీఆర్ లేటెస్ట్ కామెంట్. దానికి వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్ ఇచ్చిన పంచ్ చూస్తే విశాఖలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణాలో యాభై ఎకరాలు కొనవచ్చు అని. ఇక్కడ కేసీఆర్ చెప్పిది రైటే, గుడివాడ చెప్పిందీ రైటే. ఉమ్మడి ఏపీని తీసుకుంటే హైదరాబాద్ విశాఖ అభివృద్ధి చెందాయి.
మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి. ఇప్పటికే కాస్ట్లీ సిటీస్ లో పేదలకు చోటుందదు అని మేధావులు కలవరపడుతున్నారు. ఒకటో రెండో నగరాలను ఖరీదుగా చేసి అదే అభివృద్ధిగా చూపించే విధానం కరెక్టేనా అన్నది పాలకులే గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలి. అయినా భూముల ధరలకు రెక్కలు వస్తే అభివృద్ధి ఏంటో బొత్తిగా ఎవరికీ అర్ధం కాని వాదనగా కొట్టిపారేసే వారున్నారు.
తలసరి ఆదాయం పెరగడం, విద్య వైద్యం మెరుగుపడడం, పేదరికం తగ్గడం, దారిద్రే రేఖ దిగువన ఉన్న వారు ఎగువకు రావడం ఇవే అసలైన ప్రగతికి సూచీలు. రాజకీయ పడికట్టు భాషలో మాత్రం ఇవి ఎక్కడ కనబడడంలేదు, ఇమడడంలేదు, అభివృద్ధి అంతా భూముల్లో ఉంది అంటే జనాలు మెచ్చి ఓటేయాల్సిందేనా. ఆలోచించాల్సిందే.