హైదరాబాద్ లో మరో సైకో కిల్లర్ ప్రత్యక్షమయ్యాడు. వరుస హత్యలకు పాల్పడ్డాడు. అయితే గంటల వ్యవథిలోనే ఈ కేసును పోలీసులు ఛేదించారు. సైకో కిల్లర్ ను ప్రవీణ్ గా గుర్తించారు.
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో ట్రిపుల్ మర్డర్ కేసులు సంచలనం సృష్టించాయి. గంటల వ్యవథిలో ముగ్గురు మృతి చెందడం, పైగా ఒకే రకంగా హత్యకు గురికావడం పోలీసులకు సవాల్ గా మారింది. నిద్రిస్తున్న వ్యక్తులపై బండరాయితో మోది, మగ్గుర్ని హత్య చేశాడు ప్రవీణ్. నేతాజీ నగర్, దుర్గానగర్, కాటేదాన్ లో ఈ హత్యలకు పాల్పడ్డాడు.
ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. 4 టీమ్స్ గా ఏర్పడి, గంటల వ్యవధిలో సైకో కిల్లర్ ప్రవీణ్ ను పట్టుకున్నారు. మైలార్ దేవపల్లిలోని రాజీవ్ గృహకల్పలో ఇతడు ఉంటున్నాడు. ఇతడ్ని అరెస్ట్ చేసిన తర్వాత మరిన్ని కేసులు వెలుగులోకి వచ్చాయి. అతడి నేరాల చిట్టా చూసి పోలీసులు షాక్ అయ్యారు.
రాజేంద్రనగర్ లో ఇతడిపై ఆల్రెడీ మర్డర్ కేసు ఉంది. సరిగ్గా ఇప్పుడు జరిగినట్టుగానే, 2011లో కూడా ట్రిపుల్ మర్డర్ కేసులో అరెస్టయ్యాడు ప్రవీణ్. అప్పట్లో చంద్రయ్య అనే వ్యక్తిని, ఓ మైనర్ బాలుడ్ని హత్య చేశాడు. ఆ తర్వాత గీత అనే మహిళను అత్యాచారం చేసి హత్య చేశాడు. దీంతో పాటు 2 చోరీ కేసులు కూడా ఉన్నాయి.
హత్య కేసులో పదేళ్లు జైలులో ఉండి వచ్చాడు ప్రవీణ్. వచ్చిన కొన్నాళ్లకే మళ్లీ ట్రిపుల్ మర్డర్ చేశాడు. తాజాగా చేసిన మర్డర్లతో కలిపి, ప్రవీణ్ పై 8 హత్య కేసులున్నాయి. గంజాయి మత్తులో కొన్ని హత్యలు, డబ్బుల కోసం మరికొన్ని హత్యలు చేసినట్టు ప్రవీణ్ అంగీకరించాడు.