వెండితెరపై ఎన్నో రివెంజ్ స్టోరీలు చూశాం. తన కుటుంబీకుల్ని చంపిన విలన్లను హీరో లేదా హీరోయిన్ పక్కా ప్లాన్ తో హతమారుస్తుంది. ఇలాంటి రియల్ రివెంజ్ స్టోరీ మన కళ్లముందే జరిగితే ఎలా ఉంటుంది? మన ఇంటి పక్కనే అలాంటి సినిమా కనిపిస్తే ఎలా అనిపిస్తుంది? సరిగ్గా అలాంటి రియల్ రివెంజ్ స్టోరీనే పల్నాడు జిల్లాలో జరిగింది.
భర్తను కోల్పోయి, పిల్లలే సర్వస్వం అని జీవిస్తున్న ఆ తల్లి, ఊహించని విధంగా పెద్ద కొడుకును కూడా కోల్పోతుంది. కొడుకును హత్య చేసిన వ్యక్తుల్ని పక్కా ప్లాన్ తో హతమార్చింది. పల్నాడు జిల్లా నరసారావుపేటలో జరిగింది ఈ ఘటన.
ఇంతకీ ఏం జరిగింది..
నరసారావుపేటకు చెందిన జాన్ బీ, ఇద్దరు పిల్లలతో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. 15 ఏళ్ల కిందటే భర్తను పోగొట్టుకుంది. ఆమెకు ఖాసీం, షేక్ బాజీ పరిచయమయ్యారు. రెగ్యులర్ గా వీళ్లిద్దరూ ఇంటికి రావడం జాన్ బీ పెద్ద కొడుక్కి నచ్చలేదు. ఇద్దరికీ ఓ రోజు వార్నింగ్ ఇచ్చాడు.
దీంతో ఖాసీం, షేక్ బాజీ ప్లాన్ వేశారు. జాన్ బీ కొడుకుని తప్పిస్తే, ఇక తమకు అడ్డు ఉండదని భావించారు. 2021లో జాన్ బీ పెద్ద కొడుకును దారుణంగా హత్య చేశారు. చేతికి అందొచ్చిన కొడుకు హత్యకు గురవ్వడంతో జాన్ బీ తట్టుకోలేకపోయింది. ఖాసీం, షేక్ బాజీపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది
ఇందులో బాగంగా ముందుగా ఖాసీంపై స్కెచ్ వేసింది. మద్యం మత్తులో ఉండగా అతడ్ని హత్య చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆమె జైలుకు వెళ్లింది. కొన్నాళ్లకు బెయిల్ పై తిరిగొచ్చింది. జాన్ బీ బయటకొచ్చిందని తెలిసి షేక్ బాజీ జాగ్రత్తపడ్డాడు.
అయినప్పటికీ జాన్ బీ వదల్లేదు. తను మారిపోయానంటూ నమ్మించింది. రాత్రికి వస్తే పార్టీ చేసుకుందామని ఊరించింది. షేక్ బాజీ భ్రమపడ్డాడు. పార్టీకి వెళ్లాడు, ఫుల్లుగా మందు తాగించి బాజీని కత్తితో పొడిచి చంపేసింది జాన్ బీ.
ఆ తర్వాత జాన్ బీతో పాటు, ఆమె చిన్న కొడుకు పోలీసులకు లొంగిపోయారు. కేసు నమోదుచేసిన పోలీసులు, బాజీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు.