ప్రపంచంలో రెండు అతి పెద్ద అబద్ధాలున్నాయి
1.సూర్యుడు పడమర ఉదయించడం
2.గణాంకాలు (స్టాటిస్టిక్స్)
గణాంకాలు అంటే కాకి లెక్కలు. అధికారంలో ఉన్న వాళ్లని సంతోష పెట్టడానికి తయారు చేస్తారు. చాలా తెలివైన వాడనుకునే చంద్రబాబు కూడా ఈ గణాంకాలు నమ్మి బొక్క బోర్లా పడ్డాడు.
ఇవి ఎలా వుంటాయంటే, చంద్రబాబు హయాంలో గొర్రెల సంఖ్య 50 శాతం పెరిగింది అని అధికారులు నివేదిక ఇస్తారు. వాస్తవంగా గొర్రెలు పెరిగాయో లేదో ఎవరికీ తెలియదు. వెంటనే చంద్రబాబు పశుసంవర్థకశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఈ ఏడాది మేకల్ని అభివృద్ధి చేయమంటారు. వచ్చే మీటింగ్‌లో మేకల శాతం రెట్టింపు అయినట్టు స్టాటిస్టిక్స్ రిపోర్టులు వస్తాయి.
జగన్ కూడా అమాయకంగా ఈ రిపోర్టులే నమ్ముతున్నాడని బుధవారం జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో అర్థమైంది. ఈ నాలుగేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో 92 శాతం, నగరాల్లో 87 శాతం, రాష్ట్రమంతా సగటున 87 శాతం ఇళ్లకి మంచి జరిగిందట. అంటే ఉదాహరణకి వైజాగ్‌లో లక్ష ఇళ్లు ఉన్నాయనుకుంటే 87 వేల ఇళ్లకి ప్రభుత్వం తరపున మంచి జరిగినట్టు. అదేమిటో, ఎలాగో తెలియదు. పవర్ అంతా జగన్ చేతిలో ఉన్నప్పుడు, ప్రజెంటేషన్ ఎమ్మెల్యేలకి మాత్రం ఏమర్థమవుతుంది? అందుకే వాళ్లు తెల్లముఖాలతో అదంతా విన్నారు. నివేదికల ఆధారంగా జగన్ మాట్లాడినా, పల్లెల్లో తిరుగుతున్న ఎమ్మెల్యేలకు వాస్తవాలు తెలుసు.
పల్లెల్లో వంద ఇళ్లు వుంటే జగన్ లెక్కల ప్రకారం 92 ఇళ్లకి ప్రభుత్వం నుంచి ఏదో జరిగిపోయింది. ఇదే నిజమైతే లక్ష మంది ఓటర్లలో సరాసరి 70 శాతం (జగన్ చెప్పినంత 87 శాతం లేదనుకున్నా) జగన్ లబ్ధిదారులే. మరి ఎన్నికలకి ఇంత కసరత్తు, టెన్షన్ ఎందుకు? ఎమ్మెల్యేలు తిరగడం ఎందుకు? తిరగని వాళ్ల గ్రాఫ్ పడిపోవడం ఏమిటి?
నాలుగు సంవత్సరాల నుంచి పరిపాలన వ్యవస్థలో పెనుమార్పులు రావడం నిజమైతే 11.63 లక్షల మందితో జగనన్న సురక్ష ఎందుకు! నాలుగేళ్లుగా సమస్యలు పరిష్కారం కాని వాళ్లు ఇంకా ఉన్నారంటే ఎక్కడుంది లోపం?
గణాంకాలు, నివేదికలు ఇవన్నీ ఏ ప్రభుత్వంలోనైనా సగానికి పైగా అబద్ధాలతో, అర్థసత్యాలతో తయారు చేస్తారు. చెప్పడం కాకుండా వినడం నేర్చుకుంటే జగన్‌కి చాలా వాస్తవాలు అర్థమవుతాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా చెప్పడానికి వెనుకంజ వేసే స్థితి వున్నప్పుడు కేవలం సర్వే నివేదికలు ఆధారంగా వాస్తవాలు ఎలా తెలుస్తాయి?
ఎమ్మెల్యేలు ఇళ్లిళ్లూ తిరిగి ఏం చేయాలి? ఇంటికి ఒకట్రెండు పథకాలు పొందినంత మాత్రాన వాళ్లకు ఇంకే సమస్యలుండవా? డబ్బులు ఖర్చయ్యే ఏ పనినీ ఎమ్మెల్యేలు చేయించలేరు. నిధులు లేవు. పంచాయతీలతో చేయిద్దామంటే వాళ్ల దగ్గర పైసా లేదు. ఒకొక్కరు పది నుంచి 30 లక్షలు పెట్టి సర్పంచులుగా గెలిచారు. ప్రిస్టేజి కోసం, ఆర్థిక లబ్ధి కోసం వాళ్లు గెలిచారు. పనులు చేయనందు వల్ల పరువు లేదు, డబ్బులు ఎలాగూ లేవు. చిన్నాచితకా పనులు చేసిన వాళ్లకి బిల్లులు రావు.
సోషల్ మీడియా యాక్టీవ్‌గా పని చేయాలని జగన్ కోరుతున్నాడు. మంచిదే. గత ఎన్నికల్లో ఏమీ ఆశించకుండా చొక్కాలు చించుకొని, రక్తాలు కార్చుకుని పనిచేసిన వాళ్లకి ఏం ఒరిగింది? వాళ్లకేమైనా సన్మానాలు చేశారా? ఏమీ చేయకపోయినా జగన్ మీద అభిమానంతో రక్షణగా ఉన్నది వాళ్లే. ఈనాడు, జ్యోతి విష ప్రచారాన్ని జనం నమ్మకుండా అడ్డుకుంటున్నది సోషల్ మీడియానే తప్ప, సాక్షిలో ఏది నిజం అని వచ్చే చేంతాండంత వ్యాసాలు కాదు.
స్టాటిస్టిక్స్, సర్వేలు కాకుండా ఎమ్మెల్యేలని పిలిచి మనసు విప్పి మాట్లాడితే చాలా క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుస్తాయి. వాళ్లకి అసలే టైమ్ ఇవ్వకుండా గ్రాఫ్‌ల లెక్కలు వేస్తే పార్టీకి నష్టం. అందరి వల్ల తాను గెలుస్తాను అని నమ్మడమే నాయకత్వం. అందరినీ తానే గెలిపిస్తానని అనుకోవడం అమాయకత్వం.