తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడును గమనిస్తే.. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీని మట్టి కరిపించి ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరవేయబోయేది తానేనని ఆయన చాలా డాంబికంగా ప్రకటిస్తూ ఉంటారు. ఆయన పార్టీ నాయకులందరూ.. దేశ్ కీ నేతా కేసీఆర్ అంటూ ఆయనను కీర్తిస్తుంటారు.
అయితే మోడీని ఓడించడానికి అందరూ కలిసి ఒక్కతాటి మీదకు వస్తున్న విపక్షాలు మాత్రం కేసీఆర్ ను మోడీ వ్యతిరేకిగా విశ్వసించడం లేదు. మోడీ మరియు భాజపా వ్యూహంలో భాగంగానే.. కేసీఆర్ భారత రాష్ట్ర సమితి అనే జాతీయ పార్టీని స్థాపించారని, మోడీ వ్యతిరేక ఓటులో చీలిక తేవడం కోసం మాత్రమే ఆయన దేశమంతా తన పార్టీని సార్వత్రిక ఎన్నికల బరిలోకి దించాలని అనుకుంటున్నారని తొలినుంచి కొన్ని పుకార్లు ఉన్నాయి.
ఆ పుకార్లనే నమ్ముతున్నట్టుగా.. కేసీఆర్ ను నితీశ్ ఆధ్వర్యంలోని విపక్షనాయకులు విశ్వాసంలోకి తీసుకోలేదని అర్థమవుతోంది. ఎందుకంటే.. శుక్రవారం నాడు పాట్నాలో జరగాల్సి ఉన్న విపక్షాల సమావేశానికి కేసీఆర్ ను నితీశ్ ఆహ్వానించలేదు.
భాజపాయేతర పార్టీలలో ఒరిస్సాలోని బిజూ జనతాదళ్, ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను కూడా నితీశ్ కుమార్ ఆహ్వానించలేదు. వీరిని ఆహ్వానించకపోవడంలో ఒక స్పష్టత ఉంది. అటు వైఎస్సార్ కాంగ్రెస్ గానీ, తెలుగుదేశం గానీ .. మోడీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయడంలేదు. ప్రతి విషయంలో మోడీ సర్కారును సమర్థిస్తుంటారు. బిజూ జనతాదళ్ అంత ఏకపక్షంగా మోడీని సమర్థించకపోయినా.. మోడీ వ్యతిరేక కూటమిలోకి రాబోయేది లేదని.. నితీశ్ భువనేశ్వర్ వచ్చి తనను కలిసినప్పుడే తెగేసి చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
అయితే కేసీఆర్ విషయంలో నితీశ్ కే అసలు నమ్మకం లేకుండా పోయింది. కూటమి ప్రయత్నాలు ప్రారంభించిన తర్వాత.. నితీశ్ కనీసం హైదరాబాదు వచ్చి కేసీఆర్ ను కలవలేదు కూడా. పైగా నితీశ్ కాంగ్రెస్ సారథ్యంలోనే కూటమి ముందుకు సాగాలని అభిలషిస్తున్న నేత.
కేసీఆర్ ఇటు రాష్ట్రంలో తన పార్టీ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెసుతో వైరం మాత్రమే కొనసాగిస్తుంటారు. కాంగ్రెసు సారథ్యంలోని కూటమిలోకి వెళ్లడం ఆత్మహత్యతో సమానం అని ఆయనకు తెలుసు. ఇలాంటి అనేక కారణాల వలన నితీశ్ అండ్ కో కేసీఆర్ ను తమ విశ్వాసంలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది.
కేసీఆర్ సంగతి అటుంచితే.. విపక్షాల కూటమి ఐక్యత అనేది అంత సులువా అనే అనుమానాలు కూడా పుడుతున్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి తాను భేటీకి రాను అని తేల్చి చెప్పింది. ఢిల్లీలో అధికార్ల బదిలీలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్సును విపక్షాలు, కాంగ్రెస్ స్పష్టంగా వ్యతిరేకిస్తే తప్ప తాను కూడా రానని కేజ్రీవాల్ ప్రకటించారు. బెంగాల్లో సీపీఎంతో కాంగ్రెస్ జట్టు కట్టినంత కాలు.. తాను విపక్ష కూటమిలో ఉండబోనని మమతా దీదీ ఆంక్షలు పెడుతున్నారు. ఇన్ని బాలారిష్టాల నడుమ ఆ కూటమి భేటీ ఎలా సాగుతుందో వేచిచూడాల్సి ఉంది.