తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ట్విటర్ వేదికగా వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్ తీరాన అమరవీరుల స్మారకాన్ని కేసీఆర్ ప్రారంభిస్తున్న సందర్భంగా షర్మిల తన మార్క్ విమర్శలు గుప్పించారు. అమరుల ప్రాణ త్యాగం, దొరకు దక్కిన అధికార వైభోగం లాంటి వాడి, వేడి పంచ్ డైలాగ్‌లను కేసీఆర్‌పై షర్మిల ఎక్కుపెట్టారు.
షర్మిల తన ట్విటర్ ఖాతాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. అందులోని ముఖ్య అంశాల గురించి మాట్లాడుకుందాం. సీఎం కేసీఆర్‌ను తెలంగాణ ఉద్యమ ద్రోహిగా ఆమె విమర్శించారు. తెలంగాణ యాసను సందర్భోచితంగా ప్రయోగించడం విశేషం. షర్మిల ట్వీట్ ఏంటో తెలుసుకుందాం.
“రాష్ట్ర సాధనకై ప్రాణాలను పణంగా పెట్టిన వారు ఎందరో అయితే..ఆ ఫలాలను అందరికీ దక్కకుండా చేసిన ఉద్యమ ద్రోహి కేసీఆర్. అసువులు బాసిన అమరుల ఆశయాలు గోదారి పాలైతే .. స్వరాష్ట్ర సంపద అంతా కేసీఆర్ పాలయ్యే. నిధులు మింగే, నీళ్ళు ఎత్తుకు పోయే, ఉద్యోగాలు ఇంట్లనే ఇచ్చుకునే. త్యాగాల మీద, రక్తపు చుక్కలపై పీఠం ఎక్కిన దొర.. అమరుల కుటుంబాలను ఆద మరిచిండు. ఇన్నాళ్లు వాళ్ళెవరో అన్నట్లు, గుర్తుకు లేనట్లు నాటకాలు ఆడిండు. ఉన్నట్లుండి 9 ఏళ్లుగా లేని ప్రేమ ఎన్నికల వేల మళ్లీ పుట్టుకొచ్చే.
ఎన్నికల్లో ఓడిపోతామనే సంకేతాలతోనే అమరవీరులు మళ్ళీ యాదికొచ్చారు. రాష్ట్ర సాధనకై 15 వందల మంది ప్రాణాలు కోల్పోతే.. వారి పేర్లు కూడా తెలుసుకోలేని దిక్కుమాలిన సర్కారు ఇది. 1200 మంది అమరవీరులయ్యారని సొంత లెక్కలు బయటపెట్టిన కేసీఆర్.. ఆదుకున్నది 528 మందిని మాత్రమే. మిగిలిన 700 మంది అమరుల త్యాగాలను, చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేసిండు. ఇన్నాళ్లు గుర్తుకు రాని శంకరమ్మకు పిలిచి MLC ఇస్తాడట. ఉద్యమాన్ని అణగదొక్కిన ఉద్యమ ద్రోహులను అక్కున చేర్చుకొని తెలంగాణ తల్లికి ఆత్మఘోష రగిల్చిన మారీచుడు ఈ కేసీఆర్. కేసీఆర్ లాంటి ఉద్యమద్రోహులు అమరవీరుల స్మారక స్థూపం ఆవిష్కరించడం అంటే అమరవీరులను, తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టే”
ఇలా ఘాటు వ్యాఖ్యలతో కేసీఆర్‌పై షర్మిల అమరవీరుల కేంద్రంగా ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. గత కొంత కాలంగా క్షేత్రస్థాయి రాజకీయ కార్యకలాపాలకు షర్మిల దూరంగా వుంటున్నారు. కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏది నిజమో షర్మిల చెబితే తప్ప తెలిసే అవకాశం లేదు. ఏపీ కేంద్రంగా షర్మిల రాజకీయాలు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు.