కేవలం ఒక్క ప్రాంతం అభివృద్ధికి లక్షల కోట్లా?

అమ‌రావ‌తి విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ స్థిర‌మైన అభిప్రాయాన్ని క‌లిగి వుంది. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అభిప్రాయాలు మ‌రోసారి స్పష్టం చేశాయి. గ‌త నెల‌లో అమ‌రావ‌తి రాజ‌ధాని మార్పు కుద‌ర‌ద‌ని,…

అమ‌రావ‌తి విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ స్థిర‌మైన అభిప్రాయాన్ని క‌లిగి వుంది. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అభిప్రాయాలు మ‌రోసారి స్పష్టం చేశాయి. గ‌త నెల‌లో అమ‌రావ‌తి రాజ‌ధాని మార్పు కుద‌ర‌ద‌ని, సీఆర్‌డీఏ చ‌ట్టం చెల్ల‌ద‌ని హైకోర్టు తీర్పు నేప‌థ్యంలో ఏపీ స‌ర్కార్ 190 పేజీల అఫిడ‌విట్ దాఖ‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 

ఇవాళ ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమ‌రావ‌తి రాజ‌ధాని, కొత్త జిల్లాల ఏర్పాటు, ఇత‌ర‌త్రా విష‌యాల‌పై ఆయ‌న‌ స్ప‌ష్ట‌త ఇచ్చారు.

అమరావతి నిర్మాణానికి నిధులే ప్రధాన అడ్డంకని ఆయ‌న తేల్చి చెప్పారు. అలాంట‌ప్పుడు అమ‌రావ‌తి అభివృద్ధికి హైకోర్టు డెడ్‌లైన్ విధిస్తే ఎలా సాధ్యమవుతుంద‌ని సజ్జల ప్రశ్నించారు. ఎకరాకు రూ. 2 కోట్లు అవసరం అవుతుందని సీఎం జగన్‌ లెక్కలతో సహా అసెంబ్లీ వేదికగా చెప్పార‌ని ఆయ‌న గుర్తు చేశారు. 

కేవ‌లం ఒక్క ప్రాంతం అభివృద్ధికి ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు పెడితే ఎలా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. నిధులు ఉంటే సింగ‌పూర్ కాక‌పోతే దాని తాత‌ను రాజ‌ధానిగా నిర్మించొచ్చ‌న్నారు. ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు కాబట్టే సీఎస్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారన్నారు.

నాల్గో తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పాల‌న మొద‌లు పెట్టాల‌ని ప్ర‌భుత్వ ఆదేశాల నేప‌థ్యంలో ఆయ‌న స్ప‌ష్ట‌త ఇచ్చారు. కొత్త జిల్లాలకు సంబంధించి కసరత్తు పూర్తయ్యింద‌న్నారు. ఎప్పడైనా నోటిఫికేషన్‌ వస్తుంద‌న్నారు.  ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నామ‌న్నారు.   

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు ఉండబోతుంద‌న్నారు. కొత్తగా నిర్మించే శాశ్వత భవనాలు  15 ఎకరాల్లో ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారన్నారు. 2023 నాటికి మొత్తం కొత్త జిల్లాల శాశ్వత భవనాలు  పూర్తవుతాయ‌న్నారు.