టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా ఈరోజు లాంఛ్ అయింది. ఇందులో రవితేజ హీరోగా నటిస్తున్నాడు. మరి ఇది చిరంజీవి సినిమా ఎలా అవుతుంది? చిరంజీవి ఏమైనా ప్రత్యేక పాత్ర పోషించబోతున్నారా? అలాంటిందేం లేదు, లెక్కప్రకారం ఈ సినిమాను చిరంజీవి చేయాలి. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా బయటపెట్టారు.
“'టైగర్ నాగేశ్వరరావు కథ ముందు నేనే విన్నాను. కరోనాకు ముందు దర్శకుడు వంశీ నాకు వినిపించాడు. మంచి క్యారెక్టరైజేషన్, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ అప్పట్లో నాకు కుదరక ఈ సినిమా చేయలేకపోయాను. అలా నేను చేయాల్సిన సినిమాను నా తమ్ముడు రవితేజ చేస్తున్నాడు. అతడికిది సరిగ్గా సరిపోతుంది.”
ఈ సందర్భంగా టైగర్ నాగేశ్వరరావుకు సంబంధించి కొన్ని ఆసక్తికర వివరాల్ని బయటపెట్టారు చిరంజీవి. చిన్నప్పుడు చిరంజీవి చీరాలలోనే ఉండేవారంట. అక్కడే టైగర్ నాగేశ్వరరావు గురించి కథలు కథలుగా విన్నారట. అంతేకాదు, స్వయంగా చిరంజీవి తండ్రి టైగర్ నాగేశ్వరరావుతో మాట్లాడారంట. రాబిన్ హుడ్ టైపులో నాగేశ్వరరావు చేసే సాహసాల గురించి చిరంజీవికి, ఆయన తండ్రి చిన్నప్పుడు చెప్పేవారట.
అలా చిన్నప్పట్నుంచి టైగర్ నాగేశ్వరరావు గురించి తనకు తెలుసని, అలాంటి రియల్ లైఫ్ కథలో తను నటించలేకపోయానని తెగ ఇదైపోతూ చెప్పుకొచ్చారు చిరంజీవి. టైగర్ నాగేశ్వరరావు మూవీ ఓపెనింగ్ కు ముఖ్య అతిథిగా వచ్చారు చిరు.
రవితేజ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీగా రాబోతోంది టైగర్ నాగేశ్వరరావు సినిమా. గాయత్రి భరధ్వాజ్, నుపూర్ సనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెలలోనే సెట్స్ పైకి వస్తుంది.