జనసేనాని పవన్‌కల్యాణ్ ఎట్టకేలకు జనబాట పట్టేందుకు నిర్ణయించుకున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనుండడంతో జనానికి చేరువ కావాలనే ఉద్దేశం ఆయనలో కనిపిస్తోంది. పైగా ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్‌ను అధికారంలోకి రానివ్వననే శపథం నెరవేర్చుకునే భారీ బాధ్యతను పవన్ మీద వేసుకున్నారు కదా! ఇప్పుడు కూడా సినిమాలంటూ షూటింగ్‌ల్లో పడిపోతే ఇక శాశ్వతంగా జనం మరిచిపోతారనే భయం ఆయన్ను వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలున్నాయి. రైతుల ఆత్మహత్యలు, వారికి చేయూత, అలాగే నేరుగా పరామర్శకు రానున్న సంగతులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పంట నష్టాలతో రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పవన్ వాపోయారు. గోదావరి జిల్లాల్లోనే 73 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు పవన్ లెక్కలు చెప్పారు.
రైతాంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి కొంతైనా ఆదరువుగా నిలిచేందుకు జనసేన పక్షాన ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఇది పెద్ద సాయం కాకపోయినా కొంత వరకైనా ఉపయోగపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
తాను చేసే ఆర్థిక సాయం రైతు కుటుంబాల్లోని పిల్లల చదువులకు ఎంతోకొంత అండగా ఉంటుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చేందుకు తానే వెళ్లనున్నట్టు పవన్‌కల్యాణ్ ప్రకటించారు. కౌలు రైతుల బాధలు వింటుంటే హృదయం ద్రవిస్తోందన్నారు. వారికి తన పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.