వారెవ్వా కిషన్ రెడ్డి.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!

కిషన్ రెడ్డి కేంద్రమంత్రి అయ్యారు గానీ.. రాష్ట్ర పార్టీ సారథ్యం కిరీటం తన నెత్తిమీదకు వచ్చే వరకు సాధారణంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. తన కేంద్రమంత్రి పదవేంటో, అందులో అనుభవిస్తున్నదేంటో అన్నంతవరకే…

కిషన్ రెడ్డి కేంద్రమంత్రి అయ్యారు గానీ.. రాష్ట్ర పార్టీ సారథ్యం కిరీటం తన నెత్తిమీదకు వచ్చే వరకు సాధారణంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. తన కేంద్రమంత్రి పదవేంటో, అందులో అనుభవిస్తున్నదేంటో అన్నంతవరకే పరిమితమై ఉండేవారు. కానీ.. రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత.. అనివార్యంగా తరచుగా మీడియా ముందుకు రావాల్సి వస్తోంది. కేసీఆర్ ను తిట్టాల్సి వస్తోంది. ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. 

ఈ ఎన్నికల్లోనే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేస్తానని అంటున్నా కిషన్ రెడ్డి.. ప్రస్తుతం తమ పార్టీ తరఫున తొలిజాబితాను ప్రకటించే పనిలో ఉన్నారు. అయితే ఈ సందర్భంగా పార్టీ వ్యూహంగా వెల్లడవుతున్న కొన్ని వివరాలు.. కిషన్ రెడ్డిలో ఇంతటి అపర చాణక్యుడు దాగున్నాడా? అనే సందేహాన్ని ప్రజలకు కలిగిస్తున్నాయి. 

ఒక దెబ్బకు రెండు పిట్టలు కొట్టేలాగా.. తాను అత్యంత సేఫ్టీ జోన్ లో ఉండేలాగా.. కిషన్ రెడ్డి రాజకీయ పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వ్యూహం ఆయన మాస్టర్ స్ట్రోక్ అని అంతా అనుకుంటున్నారు.

ఇంతకూ విషయమేంటంటే.. శాసనసభ ఎన్నికల్లో సిటింగ్ ఎంపీలను కూడా బరిలోకి దించడం అనేది భారతీయ జనతా పార్టీ ఈ విడత ఒక స్ట్రాటజీ లాగా అమలుచేస్తోంది. ప్రస్తుతం ఎన్నికలు జరగబోతున్న ఇతర రాష్ట్రాల్లో కూడా బిజెపి ఎంపీలు బరిలోకి దిగుతున్నారు. అదే సూత్రం తెలంగాణలో కూడా అమలు చేయాలని అనుకున్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్టు ఉంది. 

తెలంగాణలో బిజెపికి నలుగురు ఎంపీలున్నారు. వీరిలో కిషన్ రెడ్డి ఒక్కరే కేంద్రమంత్రి. బండి సంజయ్ ను తప్పించి, ఆయనకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఇచ్చిన తర్వాత.. కేంద్రమంత్రిగా బండి సంజయ్ ను తీసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు తాజాగా సిద్ధమైన తొలి జాబితాలో కిషన్ రెడ్డి తప్ప మిగిలిన ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగబోతున్నారు.

కరీంనగర్ నుంచి బండి సంజయ్, బోధ్ నుంచి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, కోరుట్ల నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పోటీచేయబోతున్నారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఎంత మాత్రమూ లేదు.

అయితే.. ప్రస్తుతం ఎంపీలుగా, యాక్టివ్ నాయకులుగా ఉన్న వీరు విజయం సాధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బిట్వీన్ ది లైన్స్ గమనిస్తే.. పార్టీ ఎటూ ఇక్కడ అధికారంలోకి రాదు గనుక.. తాను పోటీకి దూరంగా ఉండదలచుకున్నట్టు కిషన్ రెడ్డి వ్యూహరచన చేశారని అర్థమవుతుంది. అదే సమయంలో కేంద్రంలో మోడీ సర్కారు మళ్లీ వస్తుంది గనుక.. తాను మళ్లీ ఎంపీ అయి, మళ్లీ కేంద్రమంత్రి కావొచ్చుననేది ఆయన వ్యూహమని పలువురు అంటున్నారు. కేంద్రమంత్రి పదవికి పోటీకాగల తెలంగాణ ఎంపీలను ఆయన చాలా తెలివిగా పక్కకు తప్పించి, ఎమ్మెల్యే బరిలోకి నెట్టేశారని కూడా అంటున్నారు.

అయితే పార్టీ సారథి బరిలోకి దిగకుండా.. బిజెపి ఎన్నికలకు వెళితే.. వారికి గెలుపు మీద నమ్మకం లేదనే భావన ప్రజల్లో కలుగుతుంది. బిజెపి ఏదో మొక్కుబడిగా పోటీచేస్తున్నదని అంటారు. అయినా పర్లేదు గానీ.. తన సేఫ్టీ ముఖ్యమని, ఈ డెసిషన్ తో కిషన్ రెడ్డి.. ఒక్క దెబ్బకు రెండు ప్రయోజనాలు పొందుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.