మూఢ భక్తితో ఆత్మహత్యలు చేసుకునే వాళ్లు, హత్యలు చేసే వాళ్లు భారతీయ సమాజం నుంచి కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఒక విద్యాధిక కుటుంబంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం విస్మయకరంగా ఉంది.
బాగా చదువుకుని టీచర్లుగా పని చేస్తున్న భార్యాభర్తలిద్దరు తమ పిల్లలను హతమార్చిన సంఘటన సంచలనంగా మారింది. ఒక కాలేజ్ లో లెక్చరర్ గా పని చేసే ఒక వ్యక్తి, ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పని చేసే అతడి భార్య కలిసి.. ఎదిగి వచ్చిన తమ పిల్లలను హతమార్చిన వైనం షాకింగ్ ఉంది.
ఇంట్లో నాలుగు రోజులుగా పూజలు చేస్తూ.. పిల్లలనే బలిచ్చారట వాళ్లు. ఈ అంశంపై పోలీసులు ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే నిర్ధారిస్తూ ఉన్నారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
పోలీసుల కథనం ప్రకారం.. ఆ దంపతులిద్దరూ అతి విశ్వాసపరులు. నిత్యం పూజలు, ఆరాధనలు చేసే వారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు. ఒక యువతి వయసు 27, మరో యువతి వయసు 23. ఆ పిల్లలు కూడా బాగా చదువుకున్నారు. వారిలో ఒక అమ్మాయి సంగీతాన్ని అభ్యసిస్తూ ఉండేదట. ఇంటికి వచ్చిన వారు తల్లిదండ్రుల మూఢభక్తికి బలైనట్టుగా తెలుస్తోంది.
వారి నోళ్లలో కలశాలు పెట్టి, డంబెల్స్ తో మోది ఆ తల్లిదండ్రులు హత్య చేసినట్టుగా పోలీసుల కథనం. సత్యకాలం వస్తుందని.. తమ పిల్లలు మళ్లీ బతుకుతారంటూ ఆ దంపతులు పోలీసులతో వాదించారంటే.. వారి మానసిక పరిస్థితిని అంచనా వేయొచ్చన్నట్టుగా పోలీసులు మీడియాతో స్పందించారు.
తమ పిల్లలను తాము చంపిన విషయాన్ని తన సహచర లెక్చరర్ ఒకాయనకు ఫోన్ చేసి చెప్పాడట నిందితుడు. ఆ లెక్చరర్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
సంఘటనా స్థలంలో మెహర్ బాబా ఫొటో, పూజకు ఉపయోగించిన సామాగ్రి ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు. బాబాలను, మూఢ విశ్వాసాలను నమ్మే వారు చాలా మందే ఉంటారు కానీ, ఈ తరహా ఘటనలు భక్తిలోనే మరింత పర్వర్షనేమో. ప్రస్తుతం ఆ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.