హీరో వరుణ్ ధావన్ ఓ ఇంటివాడయ్యాడు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ ను పెళ్లి చేసుకున్నాడు. అలీబాగ్ లోని ఓ బీచ్ రిసార్ట్ లో నిన్న రాత్రి వీళ్ల పెళ్లి సింపుల్ గా జరిగింది. వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, ఈ పెళ్లికి అతికొద్ది మంది ప్రముఖుల్ని మాత్రమే ఆహ్వానించారు.
అలీబాగ్ లోని ఖరీదైన లగ్జరీ రిసార్ట్ లో వరుణ్-నటాషా పెళ్లి గ్రాండ్ గా జరిగింది. అయితే అన్ని బాలీవుడ్ పెళ్లిళ్లలా ఈ పెళ్లి ఫొటోలు లీక్ అవ్వలేదు. ఎవ్వరూ అఫీషియల్ గా పోస్ట్ చేయలేదు కూడా. ఎందుకంటే, పెళ్లికొచ్చిన వాళ్లు ఫోన్ వాడకుండా వరుణ్ యూనిట్ చర్యలు తీసుకుంది. దీంతో పెళ్లికి హాజరైన ప్రముఖులు ఎవరనే విషయం మీడియాకు తెలియలేదు.
తన పెళ్లి విషయాన్ని స్వయంగా వరుణ్ ధావన్ బయటపెట్టాడు. పెళ్లి జరిగిన కొన్ని నిమిషాలకే హీరో వరుణ్ ధావన్ తన పెళ్లి ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. జీవితాంతం కొనసాగే మా ప్రేమ ఇప్పుడు అధికారికంగా మారిందంటూ క్యాప్షన్ కూడా తగిలించాడు. వరుణ్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
నిజానికి గతేడాది మే నెలలోనే నటాషాను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు వరుణ్. కానీ అప్పటికే కరోనా వైరస్ పీక్ స్టేజ్ లో ఉంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య తన పెళ్లిని వాయిదా వేసుకున్న ఈ హీరో, నిన్న నటాషాతో కలిసి ఏడు అడుగులు వేశాడు.
మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన వరుణ్, స్డూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హీరోగా మారాడు. సారా అలీఖాన్ తో కలిసి అతడు నటించిన కూలీ నంబర్-1 సినిమా తాజాగా ఓటీటీలో రిలీజైంది.