ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరగాల్సిన ప్లేస్ లలో నేటి నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. అయితే ఏపీ ప్రభుత్వాధికారులు ఇందుకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదని స్పష్టం అవుతోంది.
నామినేషన్లను ఎవరు తీసుకోవాలి? అనే స్పష్టత కూడా లేదు. ప్రభుత్వాధికారులు పై నుంచి ఆదేశాలు వచ్చే వరకూ ఎలాంటి ఏర్పాట్లూ చేయలేరు, ఎలాంటి బాధ్యతలూ తీసుకోలేరు. ఇది స్పష్టం అవుతున్న విషయమే.
ఏపీలో ప్రస్తుల పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తూ ఉంది. ఎస్ఈసీకి కూడా ఇదే విషయం చెప్పింది. అయితే ప్రభుత్వ విజ్ఞప్తులను ఎస్ఈసీ ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు కూడా. ఈ అంశంపై ఇప్పటి వరకూ జరిగిన కోర్టు విచారణలు గాక ఇంకా వ్యవహారం పెండింగ్ లో ఉంది. సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ అంశంపై సోమవారం విచారణ చేపడుతోంది.
అంతేగాక.. ఏపీలో పంచాయతీ ఎన్నికలపై మరో పిల్ దాఖలు అయ్యింది. అదొక విద్యార్థిని దాఖలు చేసిన పిల్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటు హక్కుకు అర్హత ఉన్న మూడు లక్షలా అరవై వేల మంది యువతీయువకులు ఆ హక్కును వినియోగించుకునే అవకాశం కోల్పోతారని స్వయంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ సెలవిచ్చిన నేపథ్యంలో.. ఈ అంశంపై అలాంటి వారిలో ఒకరైన ఒక విద్యార్థిని పిల్ దాఖలు చేసింది. ఏపీ హై కోర్టులో ఆ పిల్ విచారించాల్సి ఉంది.
అన్ని లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేదని స్వయంగా ఎస్ఈసీనే స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఎన్నికలు ఆగమేఘాల మీద ఎలా నిర్వహిస్తారు? అనేది మినిమం కామన్ సెన్స్ కొశ్చన్. అర్హత గల పౌరులకు ఒక అవకాశం ఇచ్చి.. వారి ఓటు హక్కు నమోదు చేసుకున్న తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి. దాని కోసమంటూ ఏ పది రోజులో ఇరవై రోజులో అయినా సమయం ఇవ్వాలి. ఇది కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా చెప్పే విషయం. అలా ఓటు హక్కును కోల్పోయే ఒక విద్యార్థినే పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో.. నేటి పౌరులకు కోర్టు ఏం చెబుతుందనేది ఆసక్తిదాయకంగా మారింది.
ఇక సుప్రీం కోర్టులో ఈ కేసు వేరే ధర్మాసనానికి బదిలీ అయ్యింది కూడా. ఒక తెలుగు జడ్జి ఉన్న ధర్మాసనం నుంచి మరో ధర్మాసనానికి కేసును మార్చారట. మరోవైపు ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ ను కూడా సుప్రీం కోర్టు విచారిస్తుందని తెలుస్తోంది. ఏపీ హై కోర్టు ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించలేదు. వ్యాక్సినేషన్ జరుగుతున్న తరుణంలో తాము ఎన్నికల విధుల్లో పాల్గొనలేమంటూ ఉద్యోగులు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.