గజ్వేల్‌పై మాయ జల్లుతున్న కేసీఆర్!

కల్వకుంట్ల చంద్రశేఖర రావు అంటేనే మాటల మరాఠీ. తన మాటలనే ఆయన మంత్రాలుగా, సమ్మోహన అస్త్రాలుగా ప్రయోగించగలరు. ఎదుటివారు ఎంతటి కొమ్ములు తిరిగిన వారైనా.. కిట్టని వారైతే నిస్సంకోచంగా ఒక ఆట ఆడుకోగలరు. అయినవారైతే…

కల్వకుంట్ల చంద్రశేఖర రావు అంటేనే మాటల మరాఠీ. తన మాటలనే ఆయన మంత్రాలుగా, సమ్మోహన అస్త్రాలుగా ప్రయోగించగలరు. ఎదుటివారు ఎంతటి కొమ్ములు తిరిగిన వారైనా.. కిట్టని వారైతే నిస్సంకోచంగా ఒక ఆట ఆడుకోగలరు. అయినవారైతే వారిని మాయచేసి మత్తులో పెట్టగలరు. అలాంటి కేసీార్ తనను వరుసగా గెలిపిస్తున్న గజ్వేల్ ప్రజల పట్ల మాత్రం భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తారు. అందుకే వారి మీద కూడా భారీస్థాయిలో తన మాటల మాయల అస్త్రాలను ప్రయోగించేశారు. 

ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ రెండు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నందువల్ల.. తనను గతంలో కూడా గెలిపిస్తున్న గజ్వేల్ ప్రజలకు ప్రత్యేకంగా సంజాయిషీ చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. నేను గెలిచిన తర్వాత కామారెడ్డికి వెళ్లిపోతానని అందరూ అంటున్నారు. కానీ ఎందుకు వెళ్తా. గజ్వేల్ లో ఇల్లు పెట్టుకుని, హైదరాబాదుకు ఇంత దగ్గరగా ఉండగా.. గజ్వేల్ ను వదులుకుని కామారెడ్డికి ఎందుకు పోతా? అని కేసీఆర్ వారికి చెబుతున్నారు. తాను ఎప్పటికీ గజ్వేల్ లోనే ఉంటానని అంటున్నారు. 

గజ్వేల్ వాసులకు ఇలాంటి గట్టి హామీ ఇస్తున్న కేసీఆర్, అటు కామారెడ్డి వాసులకు ఇంకెలాంటి మాయమాటలు చెబుతారో చూడాలి. కానీ.. కామారెడ్డి మీద ఆయన ఫోకస్ తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే.. పార్టీ ఇప్పటికే తమ వ్యూహాల్లో భాగంగా గజ్వేల్ లో కేసీఆర్, కామారెడ్డిలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తేల్చేసింది. అంటే కామారెడ్డి ప్రచారం మీద కూడా కేసీఆర్ పెద్దగా ఫోకస్ పెట్టకపోవచ్చుననే వాదన వినిపిస్తోంది. కానీ గజ్వేల్ వాసుల మీద మాయ నడుస్తూనే ఉంది. 

ఇన్నాళ్లూ గెలిచినాకూడా.. తాను ఇక్కడకు రావడం లేదని.. ఇకమీదట పరిస్థితి అలా ఉండదని కేసీఆర్ అంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంండలేకపోతున్నా అని కేసీఆర్ స్వయంగా తన గురించి తానే చెప్పుకోవడం విశేషం. పేరుకే ఎమ్మెల్యేను తప్ప ఇక్కడకు రావడం లేదని ఆయనే అన్నారు. ఈసారి అలా ఉండదని, ప్రతి నెలా ఒకసారి గజ్వేల్ కు వస్తానని, మనం అందరం కూర్చుని మాట్లాడుకుందాం అని కేసీఆర్ అంటున్నారు. 

ఏదో ఎన్నికల వేళ కాబట్టి ఇలాంటి హామీ ప్రకటిస్తున్నారు గానీ.. గజ్వేల్ ఎమ్మెల్యే మాత్రమే కాదు.. యావత్తు రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కూడా. కనీసం నెలకు ఒకసారి సెక్రటేరియేట్ కు వెళ్లే అలవాటు ఆయనకు ఉంటే.. ఆ తర్వాత ఆయన గజ్వేల్ కు వస్తారనే విషయం నమ్మవచ్చునని ప్రజలు అనుకుంటున్నారు.

నెలకు ఒకసారి వస్తాననే హామీ జనరంజకంగానే ఉంది. కానీ అలా ఎంతకాలం వస్తారు? పార్లమెంటు ఎన్నికలు వచ్చి.. ఆయన స్వయంగా ఎంపీ బరిలో నిలిచి, సింహాసనం కొడుక్కు అప్పగించి.. ఢిల్లీ వెళ్లిపోతారు కదా అనే అనుమానాలు కొందరిలో ఉన్నాయి. నెలకు ఓసారి రావాల్సిన అవసరం లేదు. గెలిపిస్తే రాష్ట్రాన్ని వదిలేసి ఢిల్లీ వెళ్లను అని చెప్పగల తెగువ కేసీఆర్ కు ఉందా అని ప్రజలు అనుకుంటున్నారు.