జగన్ హెచ్చరికల వద్ద ఆగిపోతున్నారా?

గడపగడపకు కార్యక్రమం జరుగుతున్న తీరుతెన్నుల మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా సమీక్ష నిర్వహించారు. ప్రజల్లో పార్టీ ప్రతిష్ట పెరగడానికి గడపగడపకు కార్యక్రమం చాలా కీలకం అవుతుందని జగన్ తొలినుంచి నమ్ముతున్న సంగతి తెలిసిందే. …

గడపగడపకు కార్యక్రమం జరుగుతున్న తీరుతెన్నుల మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా సమీక్ష నిర్వహించారు. ప్రజల్లో పార్టీ ప్రతిష్ట పెరగడానికి గడపగడపకు కార్యక్రమం చాలా కీలకం అవుతుందని జగన్ తొలినుంచి నమ్ముతున్న సంగతి తెలిసిందే. 

అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు.. తాము ప్రజలకు ఏం చేశామో.. ఇంటింటికీ తిరిగి వారికి వివరించడం అనేది చరిత్రలో ఎక్కడా ఉండదని, ప్రజలు తమను ఆదరిస్తారని జగన్ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అయితే.. సమీక్షలో భాగంగా.. ఇప్పటికీ పనితీరు మార్చుకోకుండా ఉన్న కొందరు ఎమ్మెల్యేల మీద జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ నిర్వహిస్తున్న సర్వేల్లో 15 మంది ఎమ్మెల్యేలు వెనకబడి ఉన్నట్టుగా తెలుస్తోందని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఆ ఎమ్మెల్యేలు గనుక తక్షణం వారి పనితీరు మార్చుకోకపోతే గనుక.. అభ్యర్థులను మార్చాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 

అయితే ఇక్కడ మరో విషయాన్ని గమనించాల్సి ఉంది. గడపగడపకు కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత.. తొలిసారి సమీక్ష సమావేశం నిర్వహించిన నాటినుంచి.. జగన్ ‘‘15 మంది ఎమ్మెల్యేలు’’ అనే పదం వాడుతున్నారు. దాదాపుగా ప్రతి సమీక్ష సమావేశంలోను ఎమ్మెల్యేల పనితీరు మారాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. 

తాజాగా ఇవాళ జరిగిన సమావేశంలో కూడా ఇదే ప్రస్తావన వచ్చింది. అయితే ఇన్నాళ్లుగా జగన్ చేస్తున్న సమీక్షల వలన పార్టీ ఎమ్మెల్యేల్లో.. తమ పనితీరు గురించి, ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమం గురించి శ్రద్ధగా లేని ఎమ్మెల్యేల్లో పరివర్తన వచ్చినట్టు?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం హెచ్చరికలకు మాత్రమే పరిమితం అవుతున్నారా? అంతకు మించి తన పార్టీ ఎమ్మెల్యేల మీద కించిత్తు అయినా కఠినంగా వ్యవహరించడానికి ఆయన వెనుకాడుతున్నారా? అనే అభిప్రాయాలు పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతున్నాయి. 

గడపగడపకు అనే కార్యక్రమం స్పూర్తి విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానమూ లేదు. అయితే ఆ స్ఫూర్తిని పార్టీ ఎమ్మెల్యేల్లోనా చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాగే.. నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండకుండా.. ఎన్నికల నాటికి చూసుకోవచ్చులే అనే ఉద్దేశంతో చెలరేగిపోయిన ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి గడప గడపకు కార్యక్రమం కింద ఇంటింటికీ తిరగాలంటే మొహం చెల్లడం లేదు. 

నిజానికి అలాంటి వారు ఈ కార్యక్రమాన్ని.. తమ వైఫల్యాలను కప్పెట్టుకోవడానికి బాగా వాడుకోవాలి. కానీ వారు పట్టించుకోవడం లేదు. ఇలాంటి ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వకుండా జగన్ ఎందుకు ఉపేక్షిస్తున్నారనేది అర్థం కాని సంగతి.

15 మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ సరిగా లేదని పదేపదే ప్రతిసారీ చెబుతూ కేవలం మాటలతో కాలక్షేపం చేసే బదులు.. గ్రాఫ్ మరీ ఘోరంగా ఉన్న ఒకరిద్దరు ఎమ్మెల్యేల విషయంలోనైనా కఠినంగా వ్యవహరించి, వారి స్థానాల్లో ప్రత్యామ్నాయ పార్టీ ఇన్చార్జిలనైనా నియమిస్తే.. మిగిలిన వారిలో కొంత చురుకుదనం వస్తుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.