ఈ రోజు ఉన్నట్లుండి ఓ గ్యాసిప్ ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను మైత్రీ మూవీస్ కు కేవలం రెండు సినిమాలకు 80 కోట్లు ఆఫర్ ఇచ్చారన్నది ఆ గ్యాసిప్. సర్కారువారి పాట, పుష్ప సినిమాల నైజాం హక్కులకు గాను 80 కోట్లు ఇస్తానని వరంగల్ శ్రీను దూకుడుగా ముందుకు వెళ్లారని టాక్. మరొ ఒకటి రెండు రోజుల్లో ఈ విషయం ఫైనల్ అవుతుందని బోగట్టా.
ఈ గ్యాసిప్ లో కొంత నిజం వుంది. ఎందుకంటే వరంగల్ శ్రీను వెళ్లి మైత్రీ నవీన్ ను కలిసింది వాస్తవం. కానీ ఈ ఎనభై కోట్ల ఆఫర్ ఎంత వరకు నిజం అన్నది, ఎంత వరకు లాజికల్ అన్నది ఆలోచించాల్సి వుంది. అలవైకుంఠపురంలో నైజాం 20 కోట్ల రేంజ్ లో ఇస్తే నలభై వసూలు చేసింది. అలా అని అన్ని సినిమాలు ఆ రేంజ్ కు వెళ్తాయని అనుకుంటే అది ఎసి డిసి ఆటలా వుంటుంది. అదే విధంగా సర్కారువారి పాట కూడా.
కేవలం దూకుడుగా వెళ్లాలనో, ఏస్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు సినిమాలు అందకుండా చేయాలనో వరంగల్ శ్రీను ఈ టైపు గేమ్ ను ఎంచుకుంటే అది సరైనది కాదనే ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే వరంగల్ శ్రీను కేవలం పుష్ప, సర్కారువారి పాట సినిమాలు రెండింటికే 80 కోట్ల ఆఫర్ ఇవ్వలేదని, ఉప్పెన, సర్కారు వారి పాట, పుష్ప, అయితే సందరానికి అనే నాలుగు సినిమాలకు కలిపి 80 కోట్ల ఆఫర్ ఇచ్చాడని తెలుస్తోంది.
అయితే ఈ పోటీలోకి తాను దిగనని, ఎవరికి కావాలంటే వాళ్లు కొనుక్కోవచ్చని, ఎవరి ఇష్టం వారిదని నిర్మాత దిల్ రాజు తన సన్నిహితులతో అంటున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఉప్పెన గతంలో దిల్ రాజుకే మాట అయింది. కానీ రేటు డిస్కషన్ ఇప్పుడు వచ్చినపుడు ఆయన ఓ రేటు కోట్ చేసి, దానికన్నా ఎక్కువ వస్తే ఎవరికైనా ఇచ్చేసుకోవచ్చు అని మైత్రీ మూవీస్ బాధ్యులకు చెప్పినట్లు తెలుస్తోంది.
మొత్తం మీద నైజాంలో వరంగల్ శ్రీను దూకుడు కొన్నాళ్లు హల్ చల్ చేసేటట్లే కనిపిస్తోంది. అయితే ఇక్కడ దిల్ రాజు లక్ ఏమిటంటే, ఆయనకు అంటూ అరడజనుకు పైగా ఫిక్స్ డ్ బ్యానర్లు వున్నాయి. ఆ బ్యానర్లు ఎంత రేటు ఇచ్చినా దిల్ రాజుకే తప్ప వేరే వాళ్లకు ఇవ్వరు. పైగా ఆయన స్వంత సినిమాలు వున్నాయి. అందువల్లే ఈ పోటీ వ్యవహారంపై దిల్ రాజు మౌనంగా వున్నారు.