బిగ్ మండే: రేపు ఏం జరగబోతోంది!?

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓవైపు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు దీన్ని సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో రేపు…

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓవైపు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు దీన్ని సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో రేపు సుప్రీంలో ఎలాంటి తీర్పు వస్తుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

నిమ్మగడ్డ అభీష్టం మేరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందా.. లేక ప్రభుత్వ వాదనలతో కోర్టు ఏకీభవిస్తుందా అనే అంశం సస్పెన్స్ సినిమాను తలపిస్తోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆఘమేఘాల మీద అన్నీ చేసేశారు. 

హుటాహుటిన నోటిఫికేషన్ ఇచ్చేశారు. ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు మీడియాకు చెప్పేశారు. సీఎస్, ప్రధాన కార్యదర్శితో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటుచేయాలని అనుకున్నప్పటికీ, అది ఆయన వల్ల కాలేదు. మరోవైపు ప్రభుత్వం ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న ఇలాంటి కీలక సమయంలో ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల విధులకు నియమించడం అత్యంత ప్రమాదకరమని తన పిటిషన్ లో పేర్కొంది. అటు ఉద్యోగ సంఘాలు కూడా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశాయి.

ఒకే అంశానికి సంబంధించిన 2 పిటిషన్లు కావడంతో.. సుప్రీంలో వీటిని విచారించే బెంచ్ మారింది. ముందుగా జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం లిస్ట్ లో ఈ పిటిషన్ ను ఫైల్ చేశారు. తాజాగా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రిషికేష్ రాయ్  బెంచ్ కు ఈ పిటిషన్లను ట్రాన్సఫర్ చేశారు. 

మరోవైపు తమ వాదనల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ ఎన్నికల సంఘం కోరింది. రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో పంచాయతీ ఎన్నికల అంశంపై విచారణ జరిగే అవకాశం ఉంది.  

మరోవైపు ఈ కేసులతో సంబంధం లేకుండా నిమ్మగడ్డ తన వ్యవహారశైలిని కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందంటూ ఏకపక్షంగా ప్రకటించిన ఆయన.. ప్రభుత్వ వర్గాలు కమిషన్ కు సహరించాల్సిదేనంటూ హుకూం జారీచేశారు. 

ఇద్దరు కలెక్టర్లతో పాటు ఒక ఐపీఎస్ ర్యాంక్ అధికారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలంటూ సీఎస్ కు లేఖ రాశారు. వీళ్లతో పాటు మరో ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలపై చర్యలు తీసుకోవాలని అందులో ఆదేశించారు.

ఓవైపు సుప్రీంకోర్టులో ఏం జరగబోతోందనే ఉత్కంఠ కొనసాగుతుండగా.. మరోవైపు ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. 2019 ఎలక్ట్రోరల్ రూల్స్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే, 3 లక్షల 60వేల మంది తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. 

ఎట్టిపరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తామంటూ దూకుడు మీదున్న నిమ్మగడ్డకు ఈ పిటిషన్ బ్రేకులు వేసేలా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తమ్మీద పంచాయతీ ఎన్నికల లొల్లి సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఏం జరగబోతోందో 'బిగ్ మండే' తేల్చబోతోంది. 

ఏపీలో ఈ ప‌రిస్ధితి అవాంఛ‌నీయ‌మైన‌ది!

దృతరాష్టుడి మాదిరిగా మారిపోతారేమో?