ఏదైనా అడగండి చెబుతాను, అదొక్కటి తప్ప …అని పవన్‌కల్యాణ్ కండీషన్ విధిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను విమర్శించేందుకు జనసేనాని పవన్‌కల్యాన్ నిద్రాహారాలు మాని మరీ మీడియాతో మాట్లాడ్తారు. అలాంటి పవన్ నుంచి మీడియా ప్రతినిధులు ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం రాబట్ట లేకపోతున్నారు. సినిమాటిక్ సస్పెన్షన్‌ను పవన్ కొనసాగిస్తున్నారు. వారాహి విజయయాత్ర మొదలు పెట్టిన పవన్‌కల్యాణ్ … తాను అధికారంలోకి వస్తే జనానికి చేసే మంచి గురించి చెప్పడం కంటే, సీఎం జగన్‌ను తిట్టిపోయడానికే సమయాన్ని వినియోగిస్తున్నారు.
జగన్‌ను తిట్టే వాళ్లుంటే, మైకులు పెట్టే వాళ్లకు కొదవలేదు. పొత్తులపై మరోసారి ఆయన నోరు విప్పారు. మరోసారి గందరగోళా నికి తెరలేపారు. జనసేన ప్రభుత్వం, తానే సీఎం అని బహిరంగ సభల్లో చెబుతున్నవన్నీ ఉత్తుత్తవే అని ఆయన ఎల్లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తేల్చి చెప్పారు. టీడీపీ, బీజేపీలతో పొత్తులపై ఆయన కొట్టి పారేయలేదు. అదంతా ఎన్నికల ముంగిట తేలుస్తామన్నారు. పొత్తులో భాగంగా సీఎం పదవి వస్తుందా? రాదా? అనేది కాలానికి ఆయన వదిలేశారు.
ఇంతకూ మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పడానికి భయపడ్డారు. ఆ విషయం చెప్పడానికి ఇంకా టైమ్ తీసుకుంటానని ఆయన అంటున్నారంటే, సీఎం వైఎస్ జగన్ దెబ్బకు ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఓటమి భయం ఆయన్ను వెంటాడుతున్నట్టుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో రెండుచోట్ల నిలిచి ఓడిపోయిన పవన్‌కు, ఈ దఫా అయినా విజయం సాధిస్తానన్న నమ్మకం ఏర్పడలేదు.
తనను ఓడించడానికి రూ.200 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా సీఎం వైఎస్ జగన్ వెనుకాడరని ఇటీవల పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఒకవేళ తాను బరిలో నిలిచే నియోజకవర్గం గురించి చెబితే, సీఎం వైఎస్ జగన్ ఏం మాయ చేస్తారో అని పవన్ వణికిపోతున్నట్టు, ఆయన సమాధానమే చెబుతోంది. వైసీపీతో పాటు టీడీపీ కూడా తనను ఓడించే అవకాశం లేకపోలేదని ఆయన అనుమానిస్తున్నారు.
టీడీపీతో పొత్తు పెట్టుకున్నా, రాజకీయంగా అడ్డు తొలగించుకునేందుకు చంద్రబాబు లోపాయికారిగా ఓడించడానికి కుట్రలకు పాల్పడే అవకాశాలు లేకపోలేదని పవన్ అనుమానిస్తున్నారు. సీఎం జగన్ ఎలాగూ తనను ఓడించడానికే పని చేస్తారని, సమస్యల్లా పైకి కనిపించని శత్రువులతోనే అనేది పవన్ మనసులో మాట. ఈ కారణాలతోనే తాను బరిలో నిలిచే నియోజకవర్గం గురించి చెప్పేందుకు పవన్ భయపడుతున్నారనేది వాస్తవం.