ఫ్లాప్ హీరో చేతిలో అరడజను సినిమాలు.. ఎందుకిలా?

టాలీవుడ్ లో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. సక్సెస్ ఫుల్ హీరో వెనక ఇండస్ట్రీ వెంటపడుతుంది. బ్యాక్ గ్రౌండ్ ఉందా లేదా అనేది అప్రస్తుతం. ఆ హీరో హిట్ కొట్టాడా లేదా అనేది మాత్రమే చూస్తారిక్కడ.…

టాలీవుడ్ లో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. సక్సెస్ ఫుల్ హీరో వెనక ఇండస్ట్రీ వెంటపడుతుంది. బ్యాక్ గ్రౌండ్ ఉందా లేదా అనేది అప్రస్తుతం. ఆ హీరో హిట్ కొట్టాడా లేదా అనేది మాత్రమే చూస్తారిక్కడ.

అలాంటి పరిశ్రమలో ఓ ఫ్లాప్ హీరో తారాజువ్వలా దూసుకుపోతున్నాడు. వరుసపెట్టి సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నాడు. అదే ఊపులో వరుసపెట్టి సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. ఇదెలా సాధ్యం.

రీసెంట్ గా సదరు హీరో నుంచి ఓ సినిమా వచ్చింది. రిలీజ్ కు ముందు ఆ సినిమా గురించి ఘనంగా చెప్పుకున్నాడు ఆ హీరో. ఫ్లాప్ అయితే ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటానంటూ పెద్దపెద్ద డైలాగులు కొట్టాడు. కట్ చేస్తే, అది డిజాస్టర్ అయింది. పెట్టిన పెట్టుబడిలో పావలా వాటా కూడా వెనక్కి రాలేదు. అంతకుముందు కూడా ఆ హీరోకు పెద్దగా హిట్లు లేవు.

ఇలాంటి హీరో ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఎడాపెడా అడ్వాన్సులు తీసుకుంటున్నాడు. ఘనంగా సినిమా ప్రారంభోత్సవాలు చేస్తున్నాడు. ఇతడితో సినిమాలు నిర్మించేందుకు ఓ వర్గం నిర్మాతలు ఎగబడుతున్నారు. ఏంటిది? అసలేం జరుగుతోంది? ఫ్లాప్ ఇచ్చే హీరో వెనక ఎందుకు ఇంతమంది పడుతున్నారు?

ఈ మొత్తం వ్యవహారం వెనక ఓ బడా ప్రొడ్యూసర్ ఉన్నాడు. తన ప్రాంతానికి చెందిన అతడ్ని, హీరోగా ఎస్టాబ్లిష్ చేసేందుకు తెరవెనక ఆ ప్రొడ్యూసర్ తెగ కష్టపడుతున్నాడు. ఇందులో భాగంగానే అతడికి ప్రాజెక్టుల్ని, నిర్మాతల్ని సెట్ చేసి పెడుతున్నాడు. అయితే వరుసగా వస్తున్న ఫ్లాపులతో ఎన్నాళ్లు ఈ బండి ఇలా నడుస్తుందో చూడాలి.